‘వ్యవసాయ’ భూములే... పాసుపుస్తకాల్లేవ్, ఎప్పుడందుతాయో తెలీదు..... అధికారులకు పట్టని ‘గోడు’..!

ABN , First Publish Date - 2020-11-27T00:09:47+05:30 IST

అధికారులు ఎంత గుడ్డిగా వ్యవహరిస్తున్నారో కొన్ని సందర్భాలను చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ఇక ప్రభుత్వం కూడా ఆయా పరిస్థితులను ఎందుకు పట్టించుకోదో మాత్రం అర్ధం కాదు. ఏదో వ్యాపార విషయాలో, ఇతరత్రా అంశాలో అనుకుంటే ఫరవాలేదు. అన్నం పెట్టే రైతన్న విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందంటే ఎవరివైపు వేలెత్తి చూపించాలో కూడా అర్ధం కాని పరిస్థితి.

‘వ్యవసాయ’ భూములే... పాసుపుస్తకాల్లేవ్, ఎప్పుడందుతాయో తెలీదు..... అధికారులకు పట్టని ‘గోడు’..!

హైదరాబాద్ : అధికారులు ఎంత గుడ్డిగా వ్యవహరిస్తున్నారో కొన్ని సందర్భాలను చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ఇక ప్రభుత్వం కూడా ఆయా పరిస్థితులను ఎందుకు పట్టించుకోదో మాత్రం అర్ధం కాదు. ఏదో వ్యాపార విషయాలో, ఇతరత్రా అంశాలో అనుకుంటే ఫరవాలేదు. అన్నం పెట్టే రైతన్న విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందంటే ఎవరివైపు వేలెత్తి చూపించాలో కూడా అర్ధం కాని పరిస్థితి. వ్యవసాయ భూములకు సంబంధించిన పాసుపుస్తకాల విషయంలో అటు అధికార యంత్రాంగం కానీ, ఇటు ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నందునే ఈ పరిస్థితి కొనసాగుతోంది.


ఈ క్రమంలో... రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే...  హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసిల్దార్ విజయారెడ్డి... కిందటేడాది నవంబరు ఐదున పట్టపగలు... అదీ తన కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురైన సందర్భాన్ని మరచిపోలేం. నిందితుడు సురేష్ అనే రైతు కూడా అదే ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 


ఈ ఘటన తర్వాత కూడా మరికొన్ని ఇటువంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ... పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకువస్తూనే ఉన్నప్పటికీ... ఆశించినంతగా ఫలితాలు కనబడంలేదన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.


ఇక విషయానికొస్తే...   రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దీర్ఘకాలం క్రితం... పెద్ద విస్తీర్ణంలోనే భూములు ‘వ్యవసాయ భూములు’గా రిజిస్ట్రేషన్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే కాలక్రమేణా వాటిచుట్టూ ఇళ్ళు వెలిసాయి. ఇక తాజా విషయమేమిటంటే... ఈ ‘వ్యవసాయ’ భూములకు సంబంధించి... వ్యవసాయేతర భూముల కింద దరఖాస్తులు చేసుకోవాలని ఆయా జిల్లాల్లో రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఇటీవలి ‘రైతుబంధు’ సందర్భంలో కూడా అధికారులు ఇలాగే చెబుతూ వచ్చారు. మొత్తంమీద ఈ క్రమంలో... పాసుపుస్తకాల అందజేత నిలిచిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఇక మరో విషయమేమిటంటే... పాసుపుస్తకాలు త్వరలోనే అందుతాయని, సంబంధిత కార్యక్రమం రెండవ దశలో ఈ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం గతంలోనే చెప్పింది. పింక్ రంగులోని పాసుపుస్తకాలు అందుతాయని పలుచోట్ల అధికారులు కూడా చెబుతూ వచ్చారు. ఇక అసలు విషయమేమిటంటే... వ్యవసాయ భూములుగా నమోదు జరిగిన ఆ భూముల చుట్టూ ఎప్పటికప్పుడు ఇళ్ళ నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి. దీంతో ఈ భూములను అటు వ్యవసాయ భూములుగా పరిగణించాలా ? లేక వ్యవసాయేతర భూములుగా పరిగణించాలా ? అన్న విషయమై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. కొన్నిచోట్ల మాత్రం ‘వ్యవసాయేతర భూములుగా రిజిస్ట్రేషన్ జరిగితేనే ఫలితముంటుంది. వాటికి సంబంధించిన రికార్డులు అందుతాయి’ ’ అంటూ ఆయా జిల్లాల్లో రెవిన్యూ అధికారులు చెబుతూ వస్తోన్న నేపధ్యంలో పాసుపుస్తకాల అందజేత మాత్రం జరగడంలేదు. 


     మరి అసలు పరిస్థితిని చూస్తే... ఆ భూములేవీ కూడా ‘వ్యవసాయేతర భూములు’ కావు. మరి వాటిని వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తూ పాసుపుస్తకాలను ఎలా అందిస్తారన్నది ఇప్పుడు రైతులను తీవ్రంగా వేధిస్తోన్న ప్రశ్న. మొత్తంమీద ఇటు ‘వ్యవసాయ భూములు’గా పాసుపుస్తకాలు అందక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ భూములను కొనాలన్నా, అమ్మాలన్నా కూడా సాధ్యపడని పరిస్థితి నెలకొంది. రెవిన్యూ అధికారులను అడిగితే స్పష్టమైన సమాధానాలు రావడంలేదు. 


ఇక ఇదిలా ఉంటే... ఈ భూముల్లో కొన్ని... ‘వ్యవసాయేతర భూములు’గా, మరికొన్నేమో ‘వ్యవసాయ భూములు’గా... ఇలా రెండు రకాలుగా కూడా ‘నమోదు’ కావడం గమనార్హం. రైతులు ఎవరికి కావాల్సిన రీతిలో వారు నమోదు చేయించుకున్నారు. ఇప్పుడు వాటి పరిస్థితేమిటన్నది ఎటూ పాలుపోని ప్రశ్న. ఇక వ్యవసాయ భూముల విషయం ప్రభుత్వం కొద్దికాలం క్రితం చేపట్టిన ‘ధరణి’లో కూడా లేదు.      మొత్తంమీద ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో తగిన దృష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-11-27T00:09:47+05:30 IST