రాష్ట్రంలో యూరియా కొరత లేదు

ABN , First Publish Date - 2020-09-17T07:53:27+05:30 IST

రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ఫోన్‌ చేసిన ఆరు గంటల్లోగా యూరియాను పంపిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆరు గంటల్లోగా పంపకపోతే తనను

రాష్ట్రంలో యూరియా కొరత లేదు

  • ఫోన్‌ చేసిన 6 గంటల్లో అందిస్తా
  • 50 వేల మెట్రిక్‌ టన్నుల బఫర్‌ ఉంది
  • శాసనసభలో మంత్రి నిరంజన్‌రెడ్డి
  • ఇప్పుడూ లైన్లలో రైతులు చెప్పులు వదులుతున్నారు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ఫోన్‌ చేసిన ఆరు గంటల్లోగా యూరియాను పంపిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆరు గంటల్లోగా పంపకపోతే తనను అడగాలని, తాను బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉపనేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు యూరియా కొరతపై మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులు యూరియా కోసం లైన్లలో చెప్పులు వదిలేవారని టీఆర్‌ఎస్‌ విమర్శించిందని, ఇప్పుడు కూడా యూరియా కోసం రైతులు చెప్పులు పెడుతున్నారంటూ పేపర్‌ క్లిప్పింగ్‌ను ఆయన చూపించారు. దీనికి మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిస్తూ రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం 50 వేల మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ ఉందని, మరో 12 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ట్రాన్సిట్‌లో ఉందని తెలిపారు.


‘‘ఈసారి కేంద్రం రాష్ట్రానికి 10,50,000 మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించగా, ఇప్పటికే 9 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేసింది.  రాష్ట్రంలో ప్రస్తుతం డీలర్‌ పాయింట్లు 6994, పీఏసీఎ్‌సలు 902, ఆగ్రో సెక్టార్లు 330, హాకా సెంటర్లు 86 కలిపి మొత్తం 8 వేలకు పైగా కేంద్రాల ద్వారా యూరియాను సరఫరా చేస్తున్నాం. ఎక్కడో ఒక ఊరిలో గంటో రెండు గంటలో లారీ ఆలస్యంగా వస్తే  రైతులు లైన్‌లో నిలబడడం సహజం. దానిని పట్టుకుని కొరత ఉందని అంటున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి దీనిని సమీక్షిస్తుంటారు. సీఎంకు రోజూ నివేదిక ఇస్తున్నాం’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. యూరియాను రెండు మూడు రోజులు ఆలస్యంగా వేసినా పంటకు నష్టం లేదని, మడులలో నీరు ఉన్నప్పుడు యూరియాను వేయకూడదని ఆయన సూచించారు.

Updated Date - 2020-09-17T07:53:27+05:30 IST