ఉపాధికి ఉసురు

ABN , First Publish Date - 2020-04-05T08:50:36+05:30 IST

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు నిలిచిపోయాయి. సాధారణంగా పనులకు పిలిస్తే.. పలుగు, పారలు, గొడ్డళ్లు, గంపలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోటెత్తే కూలీలు ఇప్పుడు ఇళ్లకే...

ఉపాధికి ఉసురు

కరోనా భయంతో ఇల్లు కదలని కూలీలు


కరోనా ప్రభావం తగ్గాకే.. 

కరోనా ప్రభావం తగ్గాక గానీ కూలీలు పనులకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. పట్టణాలకు వలస వెళ్లిన భవన నిర్మాణ కూలీలు, తాత్కాలికంగా వలస వెళ్లిన వారు ఇప్పటికే పట్టణాల నుంచి ఊర్లకు చేరుకున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా నిర్మాణ రంగంతో పాటు మరికొన్ని రంగాలు వెంటనే పుంజుకునే అవకాశాల్లేవు. గ్రామాలకు తిరిగొచ్చిన వారంతా వెంటనే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండదని, స్థానికంగానే లభించే ఉపాధి పనులకు వెళతారని అంటున్నారు. 


  •  రాష్ట్రంలో పూర్తిగా స్తంభించిన ఉపాధి పనులు
  •  మామూలుగా రోజుకు 10లక్షలమంది కూలీలు పనులకు
  •  గత మూడు రోజుల్లో 98 మంది మాత్రమే హాజరు
  •  సామాజిక దూరం పాటించే పనులు చేయాలన్నా నిరాసక్తతే
  •  హరితహారం మొక్కలకు నీళ్లు పోసేవారే కరువు
  •  వారం, పది రోజులుగా పదన లేక వాడిపోతున్న మొక్కలు
  •  వేసవితో ఇదే పరిస్థితి కొనసాగితే ఎండిపోయే ప్రమాదం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు నిలిచిపోయాయి. సాధారణంగా పనులకు పిలిస్తే.. పలుగు, పారలు, గొడ్డళ్లు, గంపలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోటెత్తే కూలీలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. పనుల పేరు చేబితేనే కరోనా భయంతో ‘అమ్మో కూలీకా మాతోని కాదు.. మేం రాం’ అని చెబుతున్నారు. చెరువు పూడిక తీత, పొలాల్లోకి సారవంతమైన మట్టి తరలింపు, హరితహారం మొక్కలకు నీళ్లు పోయడాలు, బాటల పక్కన ముళ్లకంపలు నరికివేయడాలు వంటి పనులేవీ ఇప్పుడు జరగడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి కూలీలకు స్థానికంగా పనులు కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) రాష్ట్రంలో పూర్తిగా స్తంభించింది.


రోజుకు సగటున 10లక్షల మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతుంటారు. అయితే గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 98 మంది మాత్రమే పనులకు వెళ్లారు. దీన్ని బట్టి ఉపాధి పనులపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున రూ. 3 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఏటా 10 కోట్లకు పైగా పనిదినాలు జరుగుతున్నాయి. మార్చి నుంచి జూలై వరకు ఉపాధి పనులకు సీజన్‌గా పరిగణిస్తారు. ఒక్కో రోజు గరిష్ఠంగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఉపాధి హామీ పనులకు కూలీలు హాజరైనట్లు రికార్డులు ఉన్నాయి. కరోనా ప్రభావంతో పది రోజులుగా ఉపాధి హామీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మార్చి నెలలో లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యే వరకు కూడా ఉపాధి పనులు వేగంగానే కొనసాగాయి. ఆ నెలలో లాక్‌డౌన్‌ వరకు దాదాపు 2.35 కోట్ల పనిదినాలు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో గడిచిన పది రోజులుగా ఉపాధి హామీ పనులకు కూలీలు వెళ్లడం లేదు. 


మొక్కలకు నీళ్లెలా 

ఉపాధి కూలీలు పూర్తిగా ఇళ్లకే పరిమితమవడంతో ఆ ప్రభావం మొక్కల పెంపంకంపైనా పడింది. హరితహారం భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల ప్రాంగణాల్లో కోట్లాది మొక్కలను నాటారు. వీటికి రోజూ నీళ్లు పోసి పరిరక్షించేందుకు ఉపాధి హామీ కూలీలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం కూలీలెవరూ నీళ్లు పోసేందుకు రాకపోవడంతో వారం, పది రోజులుగా పదన లేక మొక్కలు వాడిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవి తీవ్రతకు మొక్కలు ఎండిపోతాయని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాటిన మొక్కల్లో 85 శాతం బతికించాలని, లేదంటే గ్రామ సర్పంచ్‌, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొక్కల సంరక్షణ వారికి సవాలుగా మారనుంది.


రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం వివరాలు

జాబ్‌ కార్డు కలిగిన కుటుంబాలు                   5015522

ఉపాధి హామీ పథకంలో నమోదైన కూలీలు           10896919

2019-20 సంవత్సర ంలో పనిచేసిన కుటుంబాలు     2477111

2019-20 సంత్సరంలో పని చేసిన కూలీలు             4073707

2019-20 సంవత్సరంలో చేసిన ఖర్చు                 2734.10 కోట్లు

ఏప్రిల్‌ నుంచి మొదటి 3 రోజుల్లో పని చేసిన కుటుంబాలు         81

ఏప్రిల్‌ నుంచి మొదటి 3 రోజుల్లో పని చేసిన కూలీలు            98


Updated Date - 2020-04-05T08:50:36+05:30 IST