వయోభారం.. అనారోగ్యం
ABN , First Publish Date - 2020-07-27T08:48:42+05:30 IST
గ్రీన్ హంట్ పేరుతో కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు మావోయిస్టులపై ఓ వైపు దాడులు కొనసాగిస్తుండగా మరోపక్క వయోభారం, అరోగ్య సమస్యలు

- మావోయిస్టు పార్టీని వెంటాడుతున్న ఇబ్బందులు..
- కీలక నేతలంతా 50, 60 ఏళ్లు పైబడిన వారే!
- చాలామందికి రక్తపోటు, మధుమేహం
- గణపతికి ఆర్థరైటి్‌సతో పాటు ఇతర సమస్యలు
- కీలక నేత భార్యకు కరోనా.. కేడర్‌లో గుబులు
హైదరాబాద్, జూలై 26(ఆంధ్రజ్యోతి): గ్రీన్ హంట్ పేరుతో కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు మావోయిస్టులపై ఓ వైపు దాడులు కొనసాగిస్తుండగా మరోపక్క వయోభారం, అరోగ్య సమస్యలు మావోయిస్టులకు అతిపెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర కమిటీలో సగం మందికిపైగా 50, 60 ఏళ్లు దాటినవారే. పీపుల్స్‌వార్ ప్రారంభంలో చేరిన తెలంగాణ వారే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కొంతకాలంగా కీలకంగా ఉన్నారు. 1980లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పెద్దఎత్తున చేరిన యువతరం ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లింది. 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ)తో విలీనం తర్వాత పీపుల్స్‌వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా మారింది. ద్వితీయశ్రేణి నాయకులు 40 ఏళ్లు దాటి, 50 ఏళ్లకు అటూ ఇటుగా ఉన్నవారే. కొత్త నియామకాలు లేకపోవడం, ఉన్నవారు వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం పార్టీకి సమస్యగా మారింది. అదే సమయంలో వైద్యం పేరుతో మావోయిస్టు నాయకులను లొంగుబాటువైపు పోలీసులు ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
మావోయిస్టుల ఆరోగ్య సమస్యలు, వైద్యం, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచా రం ేసకరించేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పోలీసు శాఖ పునరుద్ధరించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్ టీమ్ ప్రవేశించడం, అధికార పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేల భద్రతపై నిఘా పెంచారు. ఎమ్మెల్యేలతోపాటు కీలక నాయకులెవ్వరు స్థానికంగా ఉండొద్దని సూచిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ సరిహద్దుపై నిఘా తీవ్రతరం చేశారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో కొందరు దీర్ఘకాలంగా అడవుల్లో ఉండటం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, శారీరక శ్రమ వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్, ఇర్వి మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు, జిల్లా కమిటీ సభ్యురాలు కంతి లింగవ్వ మరికొందరు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో పోలీసులు ఉచ్చుబిగిస్తున్నారు. అనారోగ్యం, వయోభారం వల్లే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తప్పుకొన్నారు. ఆయన స్థానంలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్‌ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. 70 ఏళ్లు దాటిన గణపతి ఆర్థరైటి్‌సతో పాటు పలు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణాకు చెందిన వారిలో సత్వాజీ, పుల్లూరి ప్రసాదరావు, రావుల శ్రీనివాస్, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణ రెడ్డి, మోడెం బాలకృష్ణ అంతా 60 ఏళ్లకు అటూ, ఇటుగా ఉన్నవారే. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 18 మంది తెలుగువారు ఉన్నారు.
గుండెపోటుతో కేంద్ర కమిటీ సభ్యుడి మృతి
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. రామన్న భార్య సుమిత్రకు ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ జిల్లాలోని దండకారణ్యంలో కరోనా సోకింది. ఈ విషయాన్ని మావోయిస్టు దండకారణ్య కమిటీ ఓ లేఖ ద్వారా వెల్లడించింది. సుమిత్రను పార్టీ దళం నుంచి బయటకు పంపగా ఛత్తీ్‌సగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సానుభూతిపరుల ద్వారా మందులు
మావోయిస్టు పార్టీ కేడర్‌ను కరోనా భయం వెంటాడుతోంది. లాక్‌డౌన్‌కు మందు నియామకాల కోసం జనాల్లో తిరిగిన కొందరు అడవులకు చేరుకున్న తర్వాత జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సానుభూతిపరుల సాయంతో మందులు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. మరోవైపు తెలంగాణలో ఉనికి చాటాలనుకుం టున్న మావోయిస్టులు ఛత్తీ్‌సగఢ్ నుంచి యాక్షన్ టీమ్‌ను రాష్ట్రంలోకి పంపించారు. దీంతో తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదికతో పాటు 5 మావోయిస్టు అనుబంధ సంఘాలపై పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం 130 మందే అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇందులో సగం మంది ఏపీకి చెందినవారే. 2004 చర్చల తర్వాత మావోయిస్టు పార్టీ బలహీనపడింది. ఎన్‌కౌంటర్లు, అనారోగ్యం, పార్టీ సిద్ధాంతాలతో విభేదించి పలువురు లొంగిపోయారు.
రేపటి నుంచి అమరుల వారోత్సవాలు
ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఎన్‌కౌంటర్లు, బూటకపు ఎన్‌కౌంటర్లు, అనారోగ్యంతో గత ఏడాది జూలై 28నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 110 మంది మావోయిస్టులు మరణించారని జగన్ తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలన మరింత నిరంకుశంగా మారిందని, మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ వ్యవసాయరంగాన్ని పట్టించుకోవడం లేదని, పోలీసులకు సూపర్ అధికారాలు కట్టబెట్టి, తెలంగాణను పోలీసు రాష్ట్రంగా మారుస్తున్నారని విమర్శించారు.ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఎన్‌కౌంటర్లు, బూటకపు ఎన్‌కౌంటర్లు, అనారోగ్యంతో గత ఏడాది జూలై 28నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 110 మంది మావోయిస్టులు మరణించారని జగన్ తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలన మరింత నిరంకుశంగా మారిందని, మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ వ్యవసాయరంగాన్ని పట్టించుకోవడం లేదని, పోలీసులకు సూపర్ అధికారాలు కట్టబెట్టి, తెలంగాణను పోలీసు రాష్ట్రంగా మారుస్తున్నారని విమర్శించారు.