అధిక ఫీజులపై పోరాటం
ABN , First Publish Date - 2020-10-03T10:01:54+05:30 IST
కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై పోరాటం చేస్తామని సినీనటులు

వాటిని అరికట్టే వరకు ఉద్యమం..
జీవో 46పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ప్రతి విద్యార్థి తండ్రికి అండగా నిలబడతాం: సినీనటుడు శివబాలాజీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై పోరాటం చేస్తామని సినీనటులు శివబాలాజీ, మధుమిత పేర్కొన్నారు. అధిక ఫీజులను నియంత్రించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కోర్టుల సహకారంతో ప్రైవేట్ బడుల అరాచకాలకు కళ్లెం వేస్తామని చెప్పారు. గ్రేటర్‌లో ఆన్‌లైన్ తరగతులను అడ్డుపెట్టుకుని పలు కార్పొరేట్ స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎ్‌సపీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినీహీరో శివబాలాజీ మాట్లాడారు. జీవో 46 ప్రకారం విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా.. కొన్ని పాఠశాలలు వాటిని పట్టించుకోకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ట్యూషన్ ఫీజులో లైబ్రరీ, మెయింటెనెన్స్, ఇతర ఖర్చులను కలిపి 2019 మాదిరిగానే పాత ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరరోపించారు.
ఫీజులు కట్టకుంటే పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయని ఆరోపించారు. జీవో 46పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ట్యూషన్ ఫీజుల్లో ఎలాంటివి తీసుకోవాలనే విషయాన్ని అందరికీ తెలపాలని సీఎంను కోరారు. తమ పిల్లలను మానసికంగా ఇబ్బందులకు గురిచేసినందుకే తాము హ్యుమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ట్యూషన్ ఫీజులో 35ు కట్టినా, పూర్తి ఫీజు చెల్లించలేదని పరీక్షలు రాయకుండా అడ్డుకున్నారని తెలిపారు. మొత్తం ఫీజులో 50ు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నజీవో 46ని ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు.