సింగరేణి ఓపెన్‌కాస్టు వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-16T05:23:39+05:30 IST

సింగరేణి ఓపెన్‌కాస్టు వద్ద ఉద్రిక్తత

సింగరేణి ఓపెన్‌కాస్టు వద్ద ఉద్రిక్తత
సంఘటనా స్థలం వద్ద లింగయ్య మృతదేహం

డంపర్‌ వాహనం దూసుకెళ్లి ఒకరి మృతి

నిరసనకు దిగిన గ్రామస్థులు

ఓసీ కార్యాలయం సామగ్రి, వాహన అద్దాలు ధ్వంసం 


కాకతీయఖని, డిసెంబరు 15: సింగరేణి ఓపెన్‌ కాస్టుకు చెందిన డంపర్‌ వాహనం దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓసీ కార్యాలయం మీద దాడికి దిగారు. ఈ సంఘటన భూపాలపల్లిలోని ఓపెన్‌కాస్టు సెక్టార్‌-1 వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి శివారు గడ్డిగానిపల్లికి చెందిన జడల లింగయ్య (50) చీపురు పుల్లలు ఏరేందుకు ఓసీ మీదుగా అటవీ ప్రాంతానికి వెళ్తుండగా ఓసీకి చెందిన డంపర్‌ ఒక్కసారిగా అతడిపై దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గడ్డిగానిపల్లి గ్రామస్థులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఓసీ కార్యాలయంపై దాడి చేశారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. కార్యాలయంలోని గదుల్లో ఉన్న సామగ్రిని, మూడు డంపర్‌ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి యత్నించారు. ఈ నిరసనకు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐన్‌టీయూసీ, సీఐటీయూ, టీజీబీకేఎస్‌ సంఘీభావం తెలిపాయి. సీపీఎం, సీపీఐ నాయకులతోపాటు టీఆర్‌ఎస్‌ నుంచి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, నాయకుడు సెగ్గం సిద్ధు మద్దతు తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.



Updated Date - 2020-12-16T05:23:39+05:30 IST