ఆర్కే 5బీ గనిలో ప్రమాదం

ABN , First Publish Date - 2020-09-03T09:50:42+05:30 IST

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే 5బీ గనిలో బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రత్నం లింగయ్య (54) అనే కార్మికుడు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్కే 5బీ గనిలో ప్రమాదం

  • ఓ కార్మికుడి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
  • హైదరాబాద్‌కు బాధితుల తరలింపు

శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 2: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే 5బీ గనిలో బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రత్నం లింగయ్య (54) అనే కార్మికుడు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బ్లాస్టింగ్‌ కోసం రంధ్రాలు చేస్తుండగా పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలాయి. తోటి కార్మికుల కథనం ప్రకారం రెండో షిఫ్టులో జీఎస్‌ 23 ప్యానల్‌ రిసెప్టార్‌లోని 4వ లెవెల్‌ 36.5 సీమ్‌ 2వ డిప్‌ పని స్థలంలో కార్మికులు గాదె శివయ్య, రత్నం లింగయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్‌కు కోల్‌ కటింగ్‌, బ్లాస్టింగ్‌ పనులను కేటాయించారు. షాట్‌ఫైరర్‌ కట్ల శ్రీకాంత్‌ పర్యవేక్షణలో బ్లాస్టింగ్‌ కోసం రంధ్రాలు చేస్తుండగా మిస్‌ఫైర్‌ అయింది. డ్రిల్లింగ్‌ చేసిన రంధ్రాలలో కార్మికులు స్టాంపింగ్‌ చేసి 3 మీటర్లు ముందుకు సాగిన తరవాత పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలాయి.


దీంతో 4 మీటర్ల మందంతో గల పెద్ద బొగ్గుపెళ్లలు అక్కడున్న కార్మికులపై ఎగిరి పడ్డాయి. కాళ్లు, చేతులు, నడుముపై బొగ్గు పెళ్లలు పడడంతో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తోటి కార్మికులు వారిని ఆసుపత్రికి తరలించారు. రత్నం లింగయ్యను హైదరాబాద్‌ తరలిస్తుండగా చనిపోయారు. గాదె శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. శ్రీకాంత్‌కు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. గని రక్షణాధికారిపై కేసు నమోదుచేసి విచారణ జరపాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని కోరారు. ఆర్కే 5బీ గని ప్రమాదం అత్యంత బాధాకరమని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.

Updated Date - 2020-09-03T09:50:42+05:30 IST