చీఫ్‌విప్‌ ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ

ABN , First Publish Date - 2020-10-13T05:50:27+05:30 IST

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామన్న ప్రభుత్వ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏబీవీపీ

చీఫ్‌విప్‌ ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌

అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు


సుబేదారి, అక్టోబర్‌ 12 : అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామన్న ప్రభుత్వ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే  ఇంట్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను సుబేదారి పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా వారిని పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. 


ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌  మాట్లాడుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థి నాయకులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా పనిచేయడం సిగ్గుచేటని, ఏబీవీపీ నాయకులకు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ అమలు జరిగితే  విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 60వేల మందికి పైగా విద్యార్థులకి లబ్ధి చేకూరుతుందన్నారు. పోలీసులు విద్యార్థుల గొంతు నొక్కే కుట్ర చేస్తే సహించమన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ గణేష్‌, జిల్లా సంఘటన కార్యదర్శి బాలరాజు, శివ, వంశీ, శ్రీహరి, రాజ్‌కుమార్‌, లిఖిత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కాగా, ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకే్‌షరెడ్డి అన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ త్వరలోనే తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. విద్యార్థి నాయకులపై దాడి చేసిన వారిపై సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. 


9 మందిపై కేసు 

చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ ఇంటిని ముట్టడించిన  9 మంది ఏబీవీపీ నాయకులపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసునమోదైన వారిలో అంబాల కిరణ్‌, దేరంగుల గణేష్‌, అబ్దుల్‌ పాషా, ఎర్రగొళ్ల చత్రపతి, వేల్పుల రాజ్‌కుమార్‌, కొంకల లిఖిత్‌, సుంకు తరుణ్‌, పెద్దబోయిన భగత్‌, వాగ్మారి బాలరాజు ఉన్నారు.  

 

ముట్టడి సరికాదు

హన్మకొండ టౌన్‌: ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇంటిపై ఏబీవీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి అన్నారు.  అవగాహన లేని ఏబీవీపీ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. 

Updated Date - 2020-10-13T05:50:27+05:30 IST