ముట్టడి ఉద్రిక్తం!

ABN , First Publish Date - 2020-03-12T09:01:39+05:30 IST

విద్యా రంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఏబీవీపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ముట్టడి ఉద్రిక్తం!

అసెంబ్లీ గేటు దాకా దూసుకొచ్చిన ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థులు

విద్యార్థి చెంప చెళ్లుమనిపించిన ఏడీసీపీ గంగిరెడ్డి

ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి లాఠీచార్జి

నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఏబీవీపీ పిలుపు

సీఎం స్పందించకుంటే రేపు విద్యాసంస్థల బంద్‌ 

విద్యార్థులనుకున్నారా? విద్రోహ శక్తులనుకున్నారా?

మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

సర్కారుది నియంతృత్వ ధోరణి: కాంగ్రెస్‌

పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌


హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఏబీవీపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యారంగానికి నిధుల కేటాయింపు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల తదితర సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని విద్యార్థి నాయకులు ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. ఉస్మానియా గేటులో నుంచి ఇద్దరు విద్యార్థి నాయకులు పబ్లిక్‌గార్డెన్‌ వైపు చొచ్చుకుని వచ్చారు. శాసనమండలి పక్కనే ఉన్న హార్టీకల్చర్‌ నర్సరీ వరకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ గేట్‌ నెంబరు-2 వైపు సభ్యులు వెళ్లే దారికి బారికేడ్లు అడ్డుపెట్టారు. గేట్లు దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారు. గేట్లు ఎక్కిన విద్యార్థిని చితకబాదుతున్న సెంట్రల్‌ జోన్‌ అదనపు డీసీపీ గంగిరెడ్డి చేతిలో నుంచి లాఠీని లాక్కునేందుకు ఒక విద్యార్థి నాయకుడు ప్రయత్నించాడు. దీంతో అతని చెంప చెళ్లుమనిపించిన గంగిరెడ్డి.. సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. అదేసమయంలో మరికొందరు విద్యార్థులు వచ్చి రోడ్డుపై బైఠాయించి, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు దశలవారీగా అసెంబ్లీ ముట్టడికి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఆటోలను ఆపి, వాటిలో విద్యార్థులను పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సందర్శనకు వచ్చిన వారిని కూడా లోనికి అనుమతించలేదు. ఉస్మానియా గేటు, అసెంబ్లీ గేట్‌ నెంబరు-2 వైపు సభ్యులు వెళ్లే దారిని పోలీసులు పూర్తిగా మూసేయడంతో అసెంబ్లీ సిబ్బంది, ఇతరులు చాలాసేపు ఇబ్బంది పడ్డారు. కొందరు విద్యార్థి నాయకులు సాధారణ పౌరుల్లా అక్కడే తచ్చాడుతూ సమయం చూసుకొని ఒక్కసారిగా అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా విద్యార్థి నాయకులు దశలవారీగా రావడంతో అక్కడ 45 నిమిషాల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఏబీవీపీ విద్యార్థులను పూర్తిగా అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే పీడీఎ్‌సయూ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. విద్యార్థి సంఘం నాయకులపై లాఠీచార్జిని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు ఐనాల ఉదయ్‌, అంబాల కిరణ్‌ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ స్పందించని పక్షంలో శుక్రవారం రాష్ట్ర వాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను చేపడతామన్నారు. లాఠీచార్జిలో తమ సంఘం విద్యార్థులు దాదాపు 25 మంది తీవ్రంగా గాయపడ్డారని, ముగ్గురికి చేతులు విరిగాయని తెలిపారు. లాఠీచార్జి చేసిన గంగిరెడ్డి, ఇతర పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయాలని, పోలీసుల అదుపులో ఉన్న దాదాపు 220 మందిని బేషరతుగా వదిలేయాలని డిమాండ్‌ చేశారు. 


విద్యార్థులపై దాడి హేయం: బీజేపీ నేతలు

ఏబీవీపీ విద్యార్థులపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు. పోలీసుల చర్య హేయమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, డీకే అరుణ, తదితరులు దాడిని ఖండించారు. ‘‘విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు చితకబాదుతారా? వాళ్లు విద్యార్థులనుకున్నారా? సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నారా?’’ అని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమని ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. విద్యార్థులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. 


పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సీతక్క 

అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. 


సర్కారుది నియంతృత్వ ధోరణి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి సంఘ నాయకులపై లాఠీచార్జి చేయడమేంటని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.


పోలీస్‌ వైఫల్యం!

ఏబీవీపీ, పీడీఎ్‌సయూ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ముట్టడికి వచ్చిన విద్యార్థుల్ని నిలువరించడంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు విఫలమయ్యారు. దీంతో వారు అసెంబ్లీ లోపలికి వెళ్లే గేటు వద్దకు రాగలిగారు. ఉస్మానియా గేటు వద్ద కొందర్ని అడ్డుకున్నా, ఒకరిద్దరు గేటు లోనికి చొచ్చుకెళ్లారు. నర్సరీ వద్ద పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. భద్రత ఉన్న ఉస్మానియా గేటు నుంచి విద్యార్థులు లోనికి వెళ్లే ప్రయత్నం చేసినా వారిని పూర్తిస్థాయిలో నిలువరించలేకపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

Updated Date - 2020-03-12T09:01:39+05:30 IST