రాష్ట్రంలో వరి సిరులు

ABN , First Publish Date - 2020-03-02T09:16:48+05:30 IST

రాష్ట్రంలో యాసంగి యవుసం సంబురంగా సాగుతోంది. రెండోపంట అనగానే సాగునీరు ఎలా అనే బెంగ ఈసారి ఉండబోదు. ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా నీరు అందుతుండటంతో...

రాష్ట్రంలో వరి సిరులు

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి యవుసం సంబురంగా సాగుతోంది. రెండోపంట అనగానే సాగునీరు ఎలా అనే బెంగ ఈసారి ఉండబోదు. ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా నీరు అందుతుండటంతో ఈ యాసంగి, తెలంగాణకు వరి సిరులను కురిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో 30 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. రాష్ట్రంలో యాసంగి సాధారణ విస్తీర్ణం 17.08 లక్షల ఎకరాలు. నిరుడు రబీలో 16.15 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వరిసాగు 86ు పెరిగింది. నిజామాబాద్‌లో 147 శాతం, కామారెడ్డిలో 145ు, నాగర్‌ కర్నూల్‌లో 142 శాతం, వనపర్తిలో 155 శాతం చొప్పున వరి సాగుచేశారు. 22 జిల్లాల్లో సాధారణానికి మించి వరి సాగైంది. ఈసారి యాసంగిలో 35లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో సుమారు 25 లక్షల ఎకరాలు, చెరువులు, కుంటల పరిధిలో మరో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న నీటిని ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఉపయోగించాలని నిర్ణయించారు.


ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు పరిధిలో నీటిని సరఫరా చేస్తున్నారు. కాకతీయ కెనాల్‌ ద్వారా సూర్యాపేట వరకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. అలీసాగర్‌, గుత్పా ప్రాజెక్టుల ద్వారా నిజామాబాద్‌ జిల్లాలోని లక్ష ఎకరాలకు.. ఎల్లంపల్లి నుంచి లిఫ్టు ద్వారా 50 వేల ఎకరాలకు, కడెం పరిధిలో 40 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. దేవాదుల నుంచి కూడా నీటిని లిఫ్టు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. నాగార్జున సాగర్‌ పరిధిలో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇస్తున్నారు. పాలేరు వరకు ఈ నీటి సరఫరా జరుగుతోంది. ఏఎమ్మార్పీ పరిధిలో సుమారు 1.5 లక్షల ఎకరాలకు, కల్వకుర్తి పరిధిలో 3 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇస్తున్నారు. జూరాల పరిధిలో కూడా కొంత ఆయకట్టుకు నీటిని ఇవ్వాలని నిర్ణయించారు.


మొక్కజొన్న, పప్పు ధాన్యాల సాగులోనూ

ఆరుతడి పంటల్లో ప్రధానమైన మొక్కజొన్న సాగు సాధారణంతోపోలిస్తే 123 శాతం సాగైంది. 3.77 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికిగాను 4.65 లక్షలకు మక్కల సాగు పెరిగింది. శనగలు 160 శాతం(3.69 లక్షల ఎకరాలు) సాగయ్యాయి. రాష్ట్రంలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 2.98 లక్షల ఎకరాలు ఉంటే... 4.09 లక్షల ఎకరాల్లో రబీలో పప్పు ధాన్యాలు సాగయ్యాయి. వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, పొగాకు, మిర్చి, ఉల్లిగడ్డ, నువ్వులు, పెసర, కంది, గోదుమ, జొన్న, సజ్జ సాగు మాత్రం గణనీయంగా తగ్గింది. అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.95 లక్షల ఎకరాలు ఉండగా... ఈ రబీ సీజన్‌లో 43.93 లక్షల ఎకరాలో పంటలు సాగు చేయటం గమనార్హం.

Updated Date - 2020-03-02T09:16:48+05:30 IST