సంపూర్ణ అక్షర యజ్ఞం

ABN , First Publish Date - 2020-03-04T11:10:48+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉన్నా అక్షరాస్యతలో మాత్రం కొంత వెనుకబడి ఉంది. దీంతో అందరిని అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశ్యంతో ఈచ్‌ వన్‌ -

సంపూర్ణ అక్షర యజ్ఞం

జిల్లాలో 25,511 మంది నిరక్షరాస్యుల గుర్తింపు

‘ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌’ కోసం పూర్తయిన సర్వే


ములుగు టౌన్‌ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉన్నా అక్షరాస్యతలో మాత్రం కొంత వెనుకబడి ఉంది. దీంతో అందరిని అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశ్యంతో ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి నిరక్షరాస్యులను గుర్తించారు. చదువు రాని వారికి చదువు వచ్చిన వారు నేర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాత్రి బడులు, సాక్షర భారత్‌, అమ్మా నాన్నలకు చదువు, తదితర పథకాలు కొంత వరకు ఫలితాలు ఇచ్చినా సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేక పోయాయి. ఎంతో కొంత పారితోషికాలు అందించి ఒక ఫార్ములా ప్రకారం నడిచిన ఆ పథకాలకు మంగళం పాడి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈచ్‌వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమం ఆశించిన మేర లక్ష్యాలు సాధించేనా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


 మహిళలే అధికం...

  ఈ సర్వేలో గుర్తించిన 25,511 మంది నిరక్షరాస్లులో 8,826 మంది పురుషులు ఉండగా 16,647 మంది  మహిళలు, 38 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఇందులో మహిళలు ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్నారు.  గ్రామాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక అంశాలే కారణమని అర్థమవుతుంది. జిల్లాలో అత్యధికంగా వెంకటాపురం(నూగూరు) మండలంలో 3,576మంది నిరక్షరాస్యులు ఉండగా, ములుగు మండలంలో అత్యల్పంగా 1,806 మంది నిరక్షరాస్యులు ఉన్నారు.


  అందులో మహిళా నిరక్షరాస్యులు వెంకటాపురం(నూగూరు) మండలంలోనే అధికంగా 2,378 మంది ఉండగా, కన్నాయిగూడెం మండలంలో 888 మంది తక్కువగా మహిళా నిరక్షరాస్యులు ఉన్నారు. కాగా ట్రాన్స్‌జెండర్లలో నిరక్షరాస్యులు 36 మంది ఏటూరునాగారం మండలంలో ఉండగా, మంగపేటలో ఒకరు, వెంకటాపూర్‌(రామప్ప)లో ఒకరు ఉన్నారు.


 అందరి భాగస్వామ్యంతోనే...

   పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైందని, గ్రామాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమంలోనూ అందరి భాగస్వామ్యం అవసరమని గుర్తించారు. చదువు వచ్చిన వారు చదువు రాని నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఉద్యోగులు, విద్యార్థులు, చదువుకున్న ప్రజాప్రతినిధులు, రిటైర్‌ ఉద్యోగులను భాగస్వాములను చేయనున్నారు.


 గతంలో ఎన్నో కార్యక్రమాలు...

  గతంలో గ్రామాల్లో నిరక్షరాస్యులకు విద్యాబోధన చేసి, అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 1980లో అనియత విద్య (రాత్రి బడులు)ను ఏర్పాటు చేసి కొంత వరకు అక్షరాస్యతను సాధించారు.


   దానికి కొనసాగింపుగా  2010లో సాక్షర భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో గ్రామ, మండల స్థాయిలో కో ఆర్డినేటర్లను ఏర్పాటు చేసి వయోజనులకు అక్షరాలు నేర్పించారు. చదువు నేర్చుకోవాలన్న తపన వయోజనులలో కొరవడడం, కార్యక్రమంపై అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేకపోవడం, అలాగే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. 


  దీంతో సాక్షర భారత్‌ను 2017లో అటకెక్కించారు. వీటితో పాటు అమ్మ నాన్నలకు చదువు, అక్షరజ్యోతి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇవి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించారు. గతంలో జరిగిన తప్పిదాలను ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ ప్రోగ్రాంలో దొర్లకుండా చూస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తొంది. కానీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన కార్యక్రమాలే ఆశించిన మేర లక్ష్యాలు సాధించలేక పోవడంతో స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ఏ మేరకు అక్షరాలు నేర్పిస్తుందోనని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


జిల్లాలో 25,511 మంది నిరక్షరాస్యులు

   రెండో విడత పల్లె ప్రగతిలో పది రోజుల పాటు పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే అధికారులు నిరక్షరాస్యుల సర్వే నిర్వహించారు. జిల్లాలో మొత్తం 2,93,935 మంది జనాభా ఉండగా అందులో 25,511  మంది నిరక్షరాస్యులను గుర్తించారు. ఈ సర్వే గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా 18 - 60 ఏళ్ల లోపు వయస్సు గల వారి వివరాలు సేకరించారు. ప్రతీ కుటుంబంలో చదువురాని వారి పేరు, వయస్సు, ఆధార్‌, ఇంటి, ఫోన్‌, మొబైల్‌ నెంబర్లు, సామాజిక వర్గం తదితర అంశాలపై గ్రామాల వారీగా సేకరించి, వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. 


 సర్వే పూర్తి చేశాం : వెంకయ్య : జిల్లా పంచాయతీ అధికారి

  ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని అన్ని గ్రామాల్లో నిరక్షరాస్యుల సర్వే చేపట్టాం. ఈ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. 

Updated Date - 2020-03-04T11:10:48+05:30 IST