ఒక్క ఫొటోతో మూడు పార్టీల అభిమానుల ప్రచారం

ABN , First Publish Date - 2020-05-19T09:35:23+05:30 IST

సొమ్మొకరిదైతే, సోకొకరిది అన్నట్లుగా సహాయం చేసింది ఒకరైతే ప్రచారం మాత్రం దానితో సంబంధంలేని ముగ్గురు చేసుకుంటున్నారు.

ఒక్క ఫొటోతో మూడు పార్టీల అభిమానుల ప్రచారం

  • సొమ్మొకరిదైతే సోకు ముగ్గురిది

హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): సొమ్మొకరిదైతే, సోకొకరిది అన్నట్లుగా సహాయం చేసింది ఒకరైతే ప్రచారం మాత్రం దానితో సంబంధంలేని  ముగ్గురు చేసుకుంటున్నారు.  ఓ వలస కార్మికుని కుమార్తె చిరునవ్వులు చిందిస్తూ భోజనం చేస్తున్న ఫొటోతో మూడు రాజకీయ పార్టీల అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి  సొంత రాష్ర్టాలకు తరలి వెళ్తున్న వలస కార్మికులకు మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ దగ్గర ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన శిబిరంలో భోజనం చేస్తున్న ఆ చిన్నారి ఫొటో ఆదివారం సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్న పాప నవ్వుతూ అన్నం తింటున్న ఫొటోను ‘ఆ నవ్వే మాకు స్ఫూర్తి’ అంటూ ఒక వాలంటీర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కొంత సమయం తర్వాత టీఆర్‌ఎస్‌ అభిమాని ఒకరు ‘‘ఆ చిరునవ్వుకు ఏమి ఇచ్చినా తక్కువే.


మేడ్చల్‌ టోల్‌ గేట్‌ దగ్గర తెలంగాణ ప్రభుత్వం వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలోని దృశ్యం. హ్యాట్సాఫ్‌ కేసీఆర్‌ సార్‌.’’అని ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశాడు. ‘‘హమ్మయ్య దారిన వెళుతూ ఏపీ గవర్నమెంట్‌ పుణ్యమా అని బిడ్డలు కడుపు నిండా తింటున్నారు. కాళ్లకు చెప్పులు కూడా ఇచ్చారు.’’అని ఓ వైసీపీ అభిమాని  అదే ఫోటోను షేర్‌ చేశారు. ఈ రెండు పోస్టుల స్ర్కీన్‌ షాట్లు జత చేసి, ‘‘ఒకే ఫొటోకి రెండు పార్టీల ప్రచారం. అక్కడ వలస కూలీల సంక్షేమం కోసం డబ్బు ఇచ్చింది కేంద్రం. తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకునేది లోకల్‌ పార్టీలు. తిరిగి వలస కూలీలను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ బురద జల్లే ప్రయత్నం. ఇవే రాజకీయాలు’’ అని ఓ బీజేపీ అభిమాని పోస్టు చేశారు. అసలు ఏ పార్టీ, ప్రభుత్వంతో సంబంధం లేని ఆ ఫోటో ఇలా వైరల్‌ అయ్యి, రకరకాల చర్చలకు దారి తీసింది.

Updated Date - 2020-05-19T09:35:23+05:30 IST