అమర జవాన్ పరశురాంకు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2020-12-28T08:50:50+05:30 IST
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంటతండాకు చెందిన అమర జవాన్ పరశురాం నాయక్ (32) కు మంత్రి శ్రీనివా్‌సగౌడ్ సహా వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు

అధికార లాంఛనాల నడుమ అంత్యక్రియలు
శవ పేటికను మోసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే మహేశ్
గండీడ్, డిసెంబరు 27: మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంటతండాకు చెందిన అమర జవాన్ పరశురాం నాయక్ (32) కు మంత్రి శ్రీనివా్‌సగౌడ్ సహా వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. లద్ధాఖ్‌లో విధులు నిర్వహిస్తూ ఈనెల 24న పరశురాం అమరుడయ్యారు. ఆయన భౌతికకాయం శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మంత్రి శ్రీనివా్‌సగౌడ్, పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అక్కడికి చేరుకొని ఘన నివాళులర్పించారు. ఆదివారం జవాన్ ఇంటి నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. భౌతికకాయాన్ని ఉంచిన ట్రాక్టర్‌ను మంత్రి శ్రీనివా్‌సగౌడ్ స్వయంగా నడిపారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసి శవపేటికను మోశారు. అనంతరం అధికార లాంఛనాల నడుమ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. చిన్నారులు ‘జై జవాన్’ నినాదాలు చేసి జాతీయ జెండాను ఊపారు.