పుట్టికి జీవాలను కట్టి.. నదిలో ఈడ్చుకెళుతూ..
ABN , First Publish Date - 2020-12-30T07:21:51+05:30 IST
తాళ్లతో చేతులను బిగించి, మరో కొసను ఓ బోటుకు కట్టేసి నీళ్లలో ఈడ్చుకెళితే అదెంత భయానకం? నోరులేని జీవాలకు సోమశిల వద్ద ప్రతివారం ఈ నరకయాతన ఎదురవుతోంది. జీవాల మెడకు తాళ్లను బిగించి
2 కిలోమీటర్ల మేర నీళ్లలోనే.. దళారుల కర్కశత్వం
ప్రతి వారం సొమశిల నుంచి ఇలానే తరలింపు
12మందిని బైండోవర్ చేసిన పోలీసులు
కొల్లాపూర్ రూరల్, డిసెంబరు 29: తాళ్లతో చేతులను బిగించి, మరో కొసను ఓ బోటుకు కట్టేసి నీళ్లలో ఈడ్చుకెళితే అదెంత భయానకం? నోరులేని జీవాలకు సోమశిల వద్ద ప్రతివారం ఈ నరకయాతన ఎదురవుతోంది. జీవాల మెడకు తాళ్లను బిగించి ఓ ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నదీ మార్గం గుండా దళారులు తరలిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా సింగోటం తదితర గ్రామాల్లో జరిగే సంతల్లో పశువులను వ్యాపారులుకొంటారు. వాటినికర్నూలు జిల్లాలోని సిద్దేశ్వరం, సంగమేశ్వరం తదితర గ్రామాల్లో అమ్మేందుకు తరలిస్తుంటారు. వాటిని రోడ్డు మార్గంలో కర్నూలు మీదుగా తరలించాలంటే 200 కిలోమీటర్ల దూరమవుతుందని వ్యాపారులు దగ్గరి దారిని ఎంచుకుంటున్నారు. సోమశిల దగ్గర కృష్ణా నది గుండా దాటిస్తున్నారు. ముందు ఓ మర బోటు, దానికి ఓ పుట్టిని అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్నారు. పుట్టికి వెనుకవైపు పశువులను కట్టి లాక్కెళుతున్నారు. సోమశిల వద్ద ఓ వివాహ వేడుకను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తుండగా ‘జీవాల తరలింపు’ దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. అక్కడ ప్రతి గురువారం జీవాలను ఇలానే తరలిస్తుంటారు. ఈ వ్యవహారం తెలిసినా పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సోమశిల గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు 12మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి డీఎస్పీ ముందు బైండోవర్ చేసి పూచీకత్తు మీద వదిలేసినట్లు తెలిపారు.