మూడో టీఎంసీ పేరిట భారీ స్కాం
ABN , First Publish Date - 2020-12-15T07:34:22+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మూడో టీఎంసీ వాడకానికి సంబంధించిన ప్రాజెక్టును ఓ భారీ కుంభకోణంగా బీజేపీ అభివర్ణించింది. ’వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (

రూ.20 వేల కోట్ల దోపిడీకి కుట్ర
పొర్లు దండాలు పెట్టినా... సీఎంను క్షమించం
కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: బండి సంజయ్
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మూడో టీఎంసీ వాడకానికి సంబంధించిన ప్రాజెక్టును ఓ భారీ కుంభకోణంగా బీజేపీ అభివర్ణించింది. ’వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందించకుండా మూడో టీఎం సీ పనులకు అనుమతించడం కష్టమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. విస్తరణ పేరిట రూ. 20 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి సీఎం చేస్తున్న కుట్ర ఇది. డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదో సీఎం మొదట చెప్పాలి.
రూ. 32 వేల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలుత రూపకల్పన చేసి- కేంద్రం అనుమతులిచ్చిన తర్వాత డీపీఆర్‌లు, అంచనాలు మార్చేసి- పెట్టుబడుల క్లియరెన్సులు లేకుండా అంచనా వ్యయాన్ని ఒకేసారి నిబంధనలకు విరుద్ధంగా రూ. 82 వేల కోట్లకు పెంచారు. ఎందుకు మార్చారని అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. మా రాష్ట్రం.. నా నీళ్లు మా ఇష్టం అంటారు. మీ రాష్ట్రం అంటే.. మీ అయ్య జాగీరా? మీ తాత జాగీరా? చెప్పాలి. ప్రజల ఆస్తి దోచుకుంటే అడ్డుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.
అక్టోబరు 3న ఇంజనీర్ ఇన్ చీఫ్.. కేంద్ర జలసంఘానికి లేఖ రాస్తూ.. మూడో టీఎంసీ పనుల ద్వారా ఒక్క చుక్కనీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని, అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం లేదని వివరించారని అంటూ- ’ఒక్క ఎకరాకు అదనంగా నీళ్ల ఇవ్వకుంటే విస్తరణ ప్రాజెక్టు ఎందుకు..? రూ. 20 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇది కేవలం కాంట్రాక్టర్ల జేబు లు నింపి కమిషన్ల కోసమే చేస్తున్నారు’ అని సంజయ్ ఆరోపించారు.
నోరా.. తాటిమట్టా?
’డీపీఆర్ అందించాలని అపెక్స్ కౌన్సిల్ భేటీ లోనూ కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎన్జీటీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి జలాలకు సంబంధించి లేఖ ఇస్తే ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం పేర్కొంది. ఒక్క రోజులోనే లేఖ పంపిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. 2 నెల లు గడిచినా లేఖ ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్‌ది నోరా.. లేక తాటిమట్టనా అని సంజయ్ అన్నారు.
ఈడీ దాడులు చెప్పి జరగవు
పొర్లు దండాలు పెట్టినా.. సీఎం కేసీఆర్‌ను క్షమించే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై తప్పకుండా కేసులు పెడతామని, ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. కొద్ది కాలం పాటు ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు సీఎం కేసీఆర్‌పై దాడులు నిర్వహించబోవన్న ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రస్తావించగా.. ఆ సంస్థలు చెప్పి రైడ్ చేస్తాయా అని ఎదురు ప్రశ్నించారు.
ఢిల్లీ యాత్రపై అనుమానాలున్నాయ్
’సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వచ్చారు? ఏం సాధించారు? ఈ పర్యటనపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.. టీఆర్‌ఎస్ నేతల్లోనూ అయోమయం నెలకొంది. బీజేపీపై యుద్ధం చేస్తానన్న కేసీఆర్.. ఢిల్లీలో ఏ చౌరస్తాలో కత్తి దింపారో చెప్పాలి. కేవలం అవినీతిని కప్పి పుచ్చుకోడానికే ఢిల్లీ వచ్చారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, గుంటనక్కలా దోచుకున్న సీఎం ఢిల్లీకి వచ్చి వంగి వంగి దండాలు పెడుతున్నారు’ అని సంజయ్ అన్నారు.