కరోనాతో మరో 8 మంది మృతి

ABN , First Publish Date - 2020-06-06T08:50:58+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

కరోనాతో  మరో 8 మంది మృతి

రాష్ట్రంలో 113కు చేరిన కొవిడ్‌ మరణాలు

మరో 143 పాజిటివ్‌లు.. గ్రేటర్‌లోనే 116

వైద్యులు, వైద్య సిబ్బందిని వణికిస్తున్న వైరస్‌

పేట్లబురుజులో 8 మంది.. మొత్తం 16 మందికి

8 113కు చేరిన కరోనా మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 8 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. కాగా, వీరంతా హైదరాబాద్‌వారే. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 113కు చేరింది. ఈ నెలలో ఐదు రోజుల్లోనే 31 మంది మరణించడం గమనార్హం. మార్చిలో ఆరుగురు, ఏప్రిల్‌లో 22 మంది చనిపోగా.. మేలో 54 ప్రాణాలు కోల్పోయారు. ఇక శుక్రవారం కొత్తగా 143 మందికి కరోనా నిర్థారణ అయింది. వీరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 116 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇక రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఐదు చొప్పున, వరంగల్‌లో మూడు, ఖమ్మం, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో  రెండు చొప్పున, మంచిర్యాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3290కి పెరిగింది.


కాగా, ఇప్పటిదాకా 1627 మంది కోలుకొని డిశ్చార్జ్‌  అయ్యారు. మరో 1550 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా..  శుక్రవారం మృతి చెందిన వారిలో ఆరుగురి వివరాలు వెల్లడయ్యాయి. వీరిలో చిలకలగూడకు చెందిన మహిళ(55) న్యుమోనియాతో, నాంపల్లికి చెందిన వృద్ధురాలు(66) న్యుమోనియాకు తోడు వైరస్‌ సోకడంతో బాధపడుతూ చనిపోయారు. కాచిగూడక చెందిన మరో మహిళ(57) హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతూ కరోనా సోకడంతో చనిపోయారు. ఇక బేగంబజార్‌కు చెందిన ఓ వృద్ధుడు(72) డయాబెటి్‌సతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆబిడ్స్‌కు చెందిన మరో వృద్ధుడు (80) న్యుమోనియోకు తోడు వైరస్‌ సోకడం తో మృతిచెందాడు. మచ్చబొల్లారానికి చెందిన 76 ఏళ్ల మరో వృద్ధుడూ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా సోకడంతో చనిపోయాడు.


గ్రేటర్‌లో కరోనా టెర్రర్‌..

ముషీరాబాద్‌ డివిజన్‌లోని బాకారం సమీపంలో ఢిల్లీ ఎయిరిండియాలో పనిచేసే మహిళా ఉద్యోగి(50)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బంజారాహిల్స్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో రేడియా అంకాలజి్‌స్టగా పనిచేసే డాక్టర్‌ (55)కూ పాజిటివ్‌గా తేలింది. మహేంద్రహిల్స్‌లో నివాసముంటున్న నిమ్స్‌ వైద్యురాలు(40) కరోనాగా తేలింది. కరోనా సోకిన సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యాధికారి తండ్రి(91)కి, బండ్లగూడ న్యూనాగోల్‌ పద్మావతి కాలనీకి చెందిన గాంధీ ఆస్పత్రి వైద్యురాలి(28)కి, లింగోజిగూడ విజయపురికాలనీకి చెందిన పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి వైద్యుడు(45), పోలీసు శాఖలో కమ్యూనికేషన్ల విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే ఆయన భార్య (40)కూ వైరస్‌ సోకింది. పేట్లబురుజు ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, చైతన్యపురి విద్యుత్‌నగర్‌కు చెందిన వైద్యురాలు (37), ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన వైద్యురాలి (22)కీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిమ్స్‌లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  వీరితోపాటు ఓ ఎస్‌ఐకి, హుమాయున్‌నగర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌(54)కు, పాతబస్తీ మూసాబౌలిలోని ఓ బ్యాంక్‌కు తనిఖీకి ఓ ఉన్నతాధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


వైద్యులను వణికస్తున్న కరోనా 

కరోనా వైరస్‌ వైద్యులను వణికిస్తోంది. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో తాజాగా ఎనిమిది మంది వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. ఈఎన్‌టీ ఆస్పత్రిలోనూ పీజీ వైద్య విద్యార్థికి కరోనా నిర్ధారణ అయింది. నిమ్స్‌లో ముగ్గురు ప్రొఫెసర్లు, మరో నలుగురు సిబ్బందికి వైరస్‌ సోకింది. అయితే అధికారికంగా దీనిని వెల్లడించడం లేదు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే 15 మంది పీజీ వైద్య విద్యార్థులకు వైరస్‌ సోకడంతో కొందరిని గాంధీ ఆస్పత్రికి, మరికొందరిని హోం క్వారంటైన్‌కు తరలించారు. నిమ్స్‌లో ఇప్పటివరకు రెసిడెంట్‌ డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కలిపి 19 మంది వైరస్‌ సోకింది. కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కాపువాడలో క్లినిక్‌ నిర్వహిస్తున్న ఓ ఆయుర్వేద వైద్యుడికి కరోనా సోకింది. ఈయన రెండు నెలల క్రితం అమెరికా వెళ్లివచ్చారు.

Updated Date - 2020-06-06T08:50:58+05:30 IST