సాగుకు రూ.75 వేల కోట్లు!

ABN , First Publish Date - 2020-07-07T07:17:22+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం(ఎ్‌సఎల్‌బీసీ) విడుదల చేసింది. 2020-2021కిగాను 1,61,620 కోట్లతో ప్రణాళిక ప్రకటించింది. 2019-20 వార్షిక ప్రణాళిక రూ.1,46,238.44

సాగుకు రూ.75 వేల కోట్లు!

  • గతేడాదితో పోలిస్తే 9.54 శాతం పెరుగుదల
  • 1.61లక్షల కోట్లతో 2020-21 ప్రణాళిక తయారీ
  • విడుదలచేసిన  బ్యాంకర్ల సంఘం
  • 2019-20 లో బ్యాంకుల పనితీరుపైనా నివేదిక


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం(ఎ్‌సఎల్‌బీసీ) విడుదల చేసింది. 2020-2021కిగాను 1,61,620 కోట్లతో ప్రణాళిక ప్రకటించింది. 2019-20 వార్షిక ప్రణాళిక రూ.1,46,238.44 కోట్లతో పోలిస్తే... ఈ ఏడాది రుణ ప్రణాళిక 10.52 శాతం పెరగటం విశేషం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సోమవారం సమావేశమై 2020-21 రుణ ప్రణాళికను విడుదల చేసింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ మిశ్రా, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి డా. జనార్దన్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, నాబార్డు సీజీఎం వైకే రావు, ఆర్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ సుందరం శంకర్‌, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. 


2020-21 ఎస్‌ఎల్‌బీసీ ప్రణాళిక

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,61,620 కోట్లతో రుణ ప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది. ఇందులో ప్రాధాన్యరంగాలకు రూ.1,22,720.61 కోట్లు కేటాయించారు. ఈ రంగానికి 75.93 శాతం కేటాయింపులు చేయటం గమనార్హం.
  • వ్యవసాయరంగానికి రూ.75,141.71 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే 9.54 శాతం పెంచారు.
  • స్వల్ఫకాలిక రుణాలకు 53,222.51కోట్ల కేటాయింపు. 
  • పెట్టుబడుల కోసం ఇచ్చే అప్పులు రూ.12,061.07 కోట్లు కేటాయించారు.
  • వ్యవసాయరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.2,422.37 కోట్లు కేటాయించారు. 
  • వ్యవసాయ సహాయరంగాలకు రూ. 7,435.76 కోట్లు కేటాయించారు. 
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తాజా ప్రణాళికలో రూ. 35,196.87 కోట్లు కేటాయించారు. 
  • ఇతర ప్రాధాన్యరంగాల్లో భాగంగా హౌసింగ్‌ సెక్టార్‌కు రూ.8,048.75 కోట్లు, విద్యా రుణాలకు రూ. 2,165.73 కోట్లు కేటాయించారు. 


2019- 20 వార్షిక నివేదిక

  • 2019- 20 సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు రూ.30,168 కోట్లు పెరిగాయి. 2020 మార్చి 31 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం బ్యాంకుల్లో రూ.4,84,440 కోట్ల డిపాజిట్లున్నాయి.
  • గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల అడ్వాన్సులు రూ.36,544 కోట్లు ఉండగా, 6.84 శాతం పెరుగుదల ఉంది. 
  • క్రెడిట్‌ డిపాజిట్‌ రేషియో 2019 మార్చి 31 నాటికి 117.52 శాతం ఉండగా... 2020 మార్చి 31 నాటికి 117.75 శాతానికి పెరిగింది.
  • గడిచిన ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ. 37,109 కోట్ల స్వల్ఫకాలిక రుణాలు రైతులకు ఇచ్చాయి.  76.13ు లక్ష్యం సాధించాయి.
  • వ్యవసాయం, అనుబంధ రంగాలు, మౌలిక వసతులు, ఇతరత్రా రంగాలన్నింటికి కలిపి బ్యాంకులు రూ.14,850 కోట్ల టర్మ్‌ లోన్లు పంపిణీచేశాయి.


పంట రుణాలు విడుదల చేయండి: నాబార్డ్‌ ఎదుట తెలంగాణ రైతు సంఘం నిరసన

రైతులకు బ్యాంకులు పంట రుణాలను తక్షణం  విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఆర్టీసీ చౌరస్తా సమీపంలోని నాబార్డ్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన  నిర్వహించారు. రాష్ట్రంలో వానాకాలం సాగు ప్రారంభమై 45 రోజులు గడుస్తోందని సుమారు 60 లక్షల ఎకరాల్లో పంటలు వేసినా ఇప్పటి వరకు వ్యవసాయ ప్రణాళికను ఆమోదించకపోవడం దురదృష్టకరమని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. గత్యంతరం లేక రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుతెచ్చి పనులు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్టుగా లక్షలోపు రుణాలను ఏకబిగిన రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 


రైతులకు ఇచ్చే రుణ పరిమితిని పెంచాలి: నిరంజన్‌రెడ్డి

బ్యాంకులు రైతులకుఇచ్చే రుణ పరిమితిని మరింత పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాలు సరిపోవటంలేదని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు వ్యవసాయ పనులు చేసే సమయంలో, పెట్టుబడికి డబ్బులు అవసరమైన సమయంలోనే బ్యాంకర్లు రుణాలు పంపిణీ చేయాలని సూచించారు.

Updated Date - 2020-07-07T07:17:22+05:30 IST