నానాటికీ పైపైకి

ABN , First Publish Date - 2020-06-22T08:55:11+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 కేసులు నమోదయ్యాయి.

నానాటికీ పైపైకి

24 గంటల్లో 730 మందికి వైరస్‌

2 నిమిషాలకో కొత్త కేసు!

జీహెచ్‌ఎంసీలోనే 659 కేసులు

మరో ఏడుగురి మృతి 

కాంగ్రెస్‌ నేత వీహెచ్‌కు పాజిటివ్‌ 

టప్పాచబుత్ర ఠాణాలో 

సీఐ, ఎస్సై సహా 12 మందికి..

మరో ఇద్దరు పోలీసుల మృతి

ఆలస్యంగా వెలుగులోకి..


హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 కేసులు నమోదయ్యాయి. అంటే రెండు నిమిషాలకో కొత్త కేసు వచ్చింది. ఒక్కరోజులో ఇంత భారీగా పాజిటివ్‌లు రావడం ఇదే తొలిసారి. గడిచిన ఐదు రోజుల్లోనే 2396 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంటే రోజుకు సగటున 479 మందికి వైరస్‌ సోకింది. రాజధానిలో వైరస్‌ విజృంభణ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆదివారం 730 కేసులు నమోదవగా.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 659 మందికి వైరస్‌ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ నెలాఖరుకు 10 వేల కేసులు నమోదవుతాయని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేయగా.. అంతకంటే ఎక్కువగానే కేసులొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు 3297 నమూనాలు సేకరించగా 730 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే ప్రతి 4 నమూనాల్లో ఒకరికి వైరస్‌ సోకింది.


అలాగే పాజిటివ్‌ రేటు 22.14గా నమోదైంది. గత 5 రోజుల్లో మొత్తం 11,143 నమూనాలు సేకరించగా, అందులో పాజిటివ్‌ రేటు 21గా నమోదైంది. జనగామలో 34, రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 9, ఆసిఫాబాద్‌లో 3, వరంగల్‌లో 6, వికారాబాద్‌లో 2, యాదాద్రి, నల్లగొండ, మెదక్‌, నారాయణపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ బారిన పడిన వారిసంఖ్య 7802కు చేరింది. తాజాగా 225 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 3731 కాగా, 3861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


లాక్‌డౌన్‌ తర్వాత విజృంభణ

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకముందు అంటే మార్చి 22కు ముందు సరిగ్గా 22 కేసులే ఉన్నాయి. లాక్‌డౌన్‌ 1లో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14 వరకు 622; లాక్‌డౌన్‌ 2లో ఏప్రిల్‌ 15నుంచి మే 3వరకు 438 కేసులు, లాక్‌డౌన్‌ 3లో మే 4-17వరకు 469 కేసులు, లాక్‌డౌన్‌ 4లో మే 18-31 వరకు 1147 కేసులు నమోదయ్యాయి. అన్‌లాక్‌-1 మొదలు కాగానే వైరస్‌ తీవత్ర ఒక్కసారిగా పెరిగింది. జూన్‌ 1నుంచి ఇప్పటివరకు 5104 మంది వైరస్‌ బారినపడ్డారు. టెస్టుల సంఖ్యను పెంచడంతో కే సులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 


టప్పాచబుత్ర ఠాణాలో 12 మందికి..

టప్పాచబుత్ర పోలీ్‌సస్టేషన్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. సీఐతోపాటు ఎస్సై, 10 మంది కానిస్టేబుళ్లు వైరస్‌ బారినపడ్డారు. రెండు రోజుల క్రితం ఠాణాకు చెందిన సిబ్బందంతా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 12 మందికి పాజిటివ్‌గా తేలడంతో చికిత్స కోసం ఆస్పత్రికెళ్లారు. కొంతమంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ముఖ్యంగా వాహనాలను తనిఖీ చేసిన సిబ్బందికి వైరస్‌ సోకిందని సమాచారం. 


నలుగురు పోలీసుల మృత్యువాత!

హైదరాబాద్‌ పోలీసు శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ బారిన పడిన కానిస్టేబుల్‌, హోంగార్డు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా కరోనాతో మృతి చెందారనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అధికారికంగా ఎవరూ ప్రకటించనప్పటికీ నగరంలో నలుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఆదివారం వెస్ట్‌జోన్‌లోని ఓ పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌హెచ్‌వోతో పాటు అధిక సంఖ్యలో సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో 3 కమిషనరేట్ల పరిఽధిలో పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 170కి, మృతుల సంఖ్య 4కు చేరింది. గత నెల 20న కుల్సుంపురా పీఎ్‌సలోని కానిస్టేబుల్‌ కరోనాతో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నెల 15న ఓ హోంగార్డు మృతి చెందారు. కాగా.. సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌(50) మూడు రోజుల క్రితం మృతి చెందారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో హెడ్‌ కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ ఈ నెల 7న మృతి చెందినట్లు తెలిసింది. 


ఎంజీఎంలో మూడో మరణం

వరంగల్‌ ఎంజీఎంలో ఆదివారం మరొకరు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా వ్యక్తి వైరస్‌ బారిన పడి చికిత్స పొందు తూ మృతి చెందారు.  గతంలో హుజురాబాద్‌, కాజీపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. 


కొత్తగూడెంలో సింగరేణి కార్మికుడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో తోటి కార్మికులు ఆందోళన చెందుతున్నారు.


‘గాంధీ’లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ మృతి

గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరణించారు. తోటి సెక్యూరిటీ గార్డులు ఆయన మృతదేహంతో ఆస్పత్రి ఆవరణలో అంతిమయాత్ర నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. నాచారానికి చెందిన ఆయన (55) 15 ఏళ్లుగా గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. 


హైదరాబాద్‌లో భారీగా..

కింగ్‌కోఠి ఆస్పత్రికి వచ్చిన అనుమానితుల్లో 81 మందికి పాజిటివ్‌గా తేలింది. ఓల్డ్‌ మలక్‌పేటలో 25 మందికి, అంబర్‌పేటలో 34 మందికి వైరస్‌ సోకింది. సరూర్‌నగర్‌లో ఇద్దరు, హయత్‌నగర్‌లో మరో ఇద్దరు వైద్యులకు పాజిటివ్‌ వచ్చింది. జియాగూడ కొవిడ్‌-19 పరీక్ష కేంద్రం ఇన్‌చార్జి వైద్యురాలికి, ఆమె పదేళ్ల కూతురుకూ పాజిటివ్‌ వచ్చింది. బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో 31 కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో 31, బాగ్‌ అంబర్‌పేటలో 19, నల్లకుంటలో 9, గోల్నాకలో 5, కాచిగూడలో 2 కేసులు నమోదయ్యాయి. యూసుఫ్‌గూడలో 18 మందికి వైరస్‌ సోకింది. కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్లలో 11 కేసులు నమోదయ్యాయి. సనత్‌నగర్‌లో ఒకే ఇంట్లో 8 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 


వీహెచ్‌కు పాజిటివ్‌  కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి.. భట్టి


రాష్ట్రంలో మరో కాంగ్రెస్‌ నేత కరోనా వైరస్‌ బారిన పడ్డారు. పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆదివారం ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వీహెచ్‌కు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం సాయంత్రం పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే శుక్రవారం వరకూ ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే వీహెచ్‌ తన నివాసంలో దామోదర్‌ రాజనర్సింహ, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. 19న రాహుల్‌ జన్మదినం సందర్భంగా దాదాపు 200 మందికి దుప్పట్లు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవలే టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి పాజిటివ్‌గా తేలి చికిత్స తీసుకుంటు న్న సంగతి తెలిసిందే. తాజాగా వీహెచ్‌కూ వైరస్‌ సోకడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 


మున్ముందు ఇంకెంతమంది వైరస్‌ బారిన పడతారోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీహెచ్‌కు వైరస్‌ ఎక్కడ అంటుకుందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన ఈ నెల 11న గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. స్వయంగా అక్కడికి వెళ్లారు. అప్పుడే వైరస్‌ అంటుకుందా అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన భార్య, సిబ్బంది, కారు డ్రైవర్‌, పనిమనుషులు, వాచ్‌మెన్‌కు పరీక్షలు నిర్వహించారు. వీ రందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. ప్రజలు, కాం గ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సూచించారు. కరోనాతో బాధపడుతున్న పార్టీ నేతలు వీహెచ్‌, గూడూరు నారాయణరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


68 టెస్టులు.. 31 పాజిటివ్‌లు!

ప్రజారోగ్య శాఖ సంచార బృందం ఆధ్వర్యంలో ఈ నెల 17న రాజేంద్రనగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 68 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 31 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-06-22T08:55:11+05:30 IST