మరో మహిమ!
ABN , First Publish Date - 2020-12-17T08:39:47+05:30 IST
ప్యారానగర్ పరిఽధిలో సర్వే నంబరు 1 నుంచి 65 వరకూ సుమారు 700 ఎకరాల భూమి ఉంది. స్వాతంత్య్రం రాక ముందు ముస్లిం జాగీర్ల పేరిట ఉన్న భూములు

ఊరు ఊరంతా కబ్జాకు కుట్ర..
700 ఎకరాల ఇళ్ల స్థలాలు, భూములపై కన్ను
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో భూ బకాసురులు
పట్టాదారుల్లో స్థానికులు, హైదరాబాద్‌వాసులు
ప్రజాప్రతినిధి అనుచరుల హెచ్చరికలు
భూములన్నీ తమవేనంటూ తప్పుడు పత్రాల సృష్టి
కోర్టుల్లో ఎదురు దెబ్బలతో బెదిరింపుల పర్వం
ప్యారానగర్..! సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ గ్రామం. ఐదు దశాబ్దాల కిందటే నల్లగొండ జిల్లా నుంచి బతుకుదెరువు వెతుక్కుంటూ కొంతమంది వచ్చారు. స్థానికంగా భూములు కొనుక్కుని ఇళ్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే మరికొందరు కూడా ఇక్కడ భూములు కొనుక్కున్నారు. పట్టాలు కూడా పొందారు. ఇటీవలి కాలంలో ఈ భూముల ధర లు విపరీతంగా పెరిగాయి. దాంతో, పటాన్‌చెరు నియోజకవర్గ ముఖ్య ప్రజా ప్రతినిధి అనుచరులు పట్టాదారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ భూములను తాము ఎప్పుడో కొనుగోలు చేశామంటూ రికార్డులు పుట్టిస్తున్నారు. ఉదాహరణకు, హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వేణుగోపాలరావు నివాసం ఉంటున్నారు. 2006లో ఆయన ప్యారానగర్‌లో భూమి కొనుగోలు చేశారు. వేణుగోపాల్‌రావుకు 8 ఎకరాల 21 గుంటలు; భార్య పద్మ పేరిట 7 ఎకరాల 21 గుంటలు ఉంది. ఆయన దగ్గర అన్ని ధ్రువపత్రాలూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండడానికి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. వెన్వెంటనే, ఆ భూములను తాము కొనుగోలు చేశామని, ఎవరూ రావద్దని ప్రజా ప్రతినిధిఅనుచరులు అడ్డుకున్నారు. దాంతో, ఆయన పోలీసులను ఆశ్రయించారు.
(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం)
ప్యారానగర్ పరిధిలో సర్వే నంబరు 1 నుంచి 65 వరకూ సుమారు 700 ఎకరాల భూమి ఉంది. స్వాతంత్య్రం రాక ముందు ముస్లిం జాగీర్ల పేరిట ఉన్న భూములు అనంతరం వివిధ రూపాల్లో మారుతూ వచ్చాయి. ప్రస్తుతం సుమారు 150 మంది పేరిట ఈ భూములు ఉన్నాయి. వీరిలో నల్లగొండ నుంచి వచ్చిన 50 కుటుంబాల పేరిట దాదాపు 200 ఎకరాలు ఉంటే.. హైదరాబాద్ నుంచి వచ్చి కొనుగోలు చేసిన మరో వంద మంది పేరిట మిగిలిన 500 ఎకరాలూ ఉన్నాయి. ఈ భూములు జాగీర్లకు చెందినవి కావడంతో చిన్న చిన్న లొసుగులను ఆధారం చేసుకుని వాటిని కాజేయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక్కడి 700 ఎకరాలనూ మున్నోత్ చారిటబుల్ ట్రస్టు తరఫున మహావీర్ జైన్ తమకు అమ్మారని, అందుకు సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చేశామని, ఈ భూముల్లోకి ఎవ రూ రావద్దని సదరు ప్రజా ప్రతినిధి అనుచరులు బెదిరిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరిస్తున్నారు. చారిటబుల్ ట్రస్టు పేరిట తమపై తప్పుడు కేసులు పెడుతూ తమ భూములను చేజిక్కించుకోవడానికి కుట్ర పన్నుతున్నారని వేణుగోపాలరావు వాపోయారు.
కోర్టుల్లో కేసులు.. ఎదురు దెబ్బలు
మున్నోత్ చారిటబుల్ ట్రస్టు ద్వారా భూమిని దక్కించుకోవడానికి ఏళ్ల తరబడి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ కోర్టుల్లో, చివరకు హైకోర్టులోనూ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెవెన్యూ కోర్టులతోపాటు హైకోర్టు వరకు కేసు లు వేసి దశాబ్ధ కాలంగా తమను తిప్పారని, తాము కొనుగోలు చేసిన సమ యం నుంచీ ఉన్న ఆఽధారాలు చూపించడంతో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పలువురు గ్రామస్థులు తెలిపారు.
సివిల్ కోర్టులోనూ ట్రస్టు వేసిన డిక్లరేషన్ సూట్‌ను 2016లో డిస్‌మిస్ చేశారని తెలిపారు. 1954 నుంచిఅన్ని అధికారిక రికార్డుల్లోనూ ప్రస్తుత భూ యజమానులు, వారికి భూములు అమ్మిన వారి పేర్లు మాత్రమే ఉన్నాయని, అయినా, దౌర్జన్యం గా తమను అడ్డుకుంటున్నారని వివరించారు. అంతేనా, 700 ఎకరాలూ తామే కొనుగోలు చేశామని, గ్రామంతోపాటు భూ ములన్నీ తమవేనని బెదిరిస్తుండటంతో గ్రామస్థులు సైతం అయోమయంలో పడ్డారు. అయితే, హైదరాబాద్‌లో ఉండి ప్యారానగర్‌లో కొనుగోలు చేసిన వారి భూములపైనే ఇక్కడి పెద్దల చూపు పడింది. వారు ఎలాగూ ఇక్కడకు రారని, వచ్చినా వారిని నయానా భయానా తప్పుడు పత్రాలతో బెదిరించి భూములను కాజేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.
కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తా: వేణుగోపాల్‌రావు
ప్యారానగర్‌లో తాను 2006లో భూమి కొనుగోలు చేశానని, అప్పటి నుంచీ తన అధీనంలో ఉందని, ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి, ఇంటిని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కొందరు ఇక్కడి పెద్ద నాయకుల పేరు చెప్పి తమను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వేణుగోపాల్‌రావు తెలిపారు. వారిపై తగిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు. తప్పుడు పత్రాలతో తమ భూములను కాజేయాలని ముఖ్య ప్రజా ప్రతినిధి అనుచరులు చేస్తున్న కుట్రను ఆపడానికి అవసరమైతే ఎంతవరకైనా వెళ్తానని, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళతానని వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు.
పాస్ పుస్తకాలూ అడ్డగింత
ప్యారానగర్‌లో నివాసముంటున్న వారితోపాటు ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారికి పాస్ పుస్తకాలు రావడానికి గ్రామస్థులు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇటీవల కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయి. కానీ, కేవలం 39 మందికి మాత్రమే వాటిని ఇచ్చారు. ఇంకా కొందరికి రావాల్సి ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇక్కడ భూములు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఉంటున్న వారివే. వారిలో వేణుగోపాల్‌రావు కూడా ఉన్నారు. అయితే, ప్యారానగర్‌కు సంబంధించి రికార్డుల్లో ఉన్న భూములకు, క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు వ్యత్యాసం ఉందని, దానిపై విచారణ జరుపుతున్నామని గుమ్మడిదల తహసీల్దార్ భిక్షపతి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. వివాదాస్ప భూముల విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని గుమ్మడిదల ఎస్సై విజయ్‌కృష్ణ చెప్పారు.