6 నెలల్లో 630 చెక్‌డ్యాంలను నిర్మించాలి
ABN , First Publish Date - 2020-12-10T10:12:24+05:30 IST
రాష్ట్రంలో వచ్చే ఆరు నెలల్లో సుమారు 630 చెక్‌డ్యాంల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వర్కింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. చెక్‌డ్యాంల నిర్మాణంపై బుధవారం ఇరిగేషన్ శాఖ

అధిక ధరలకు కోట్ చేసిన టెండర్లపై విచారణ.. అధికారుల నిర్ణయం
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఆరు నెలల్లో సుమారు 630 చెక్‌డ్యాంల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వర్కింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. చెక్‌డ్యాంల నిర్మాణంపై బుధవారం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో సుమారు 1,200 చెక్‌డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఈ ఏడాది 630 చెక్‌డ్యాంలను, వచ్చే ఏడాది మిగిలిన చెక్‌డ్యాంలను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం నాబార్డు సంస్థ నుంచి ప్రత్యేక రుణాన్ని కూడా తీసుకువస్తున్నారు. ఈ ఏడాది నిర్మించే చెక్‌డ్యాంలకు సంబంధించి ఇప్పటికే సుమారు 520 చెక్‌డ్యాంలకు టెండర్లను ఖరారు చేశారు. అయితే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఖరారు చేసిన ధరల కంటే ఎక్కువ ధరలను కోట్ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల జోక్యం కారణంగా ఈ టెండర్ ఖరారు ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు కుమ్మక్కై.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు కోట్ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి టెండర్లపై విచారణ జరిపించాలని భావిస్తున్నారు.