63 శాతం మంది ‘ప్రైవేటు’కే!

ABN , First Publish Date - 2020-09-06T10:43:01+05:30 IST

63 శాతం మంది ‘ప్రైవేటు’కే!

63 శాతం మంది ‘ప్రైవేటు’కే!

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న కొవిడ్‌ రోగులు 37 శాతం మందే

పడకల భర్తీ కూడా 10 శాతమే 

సౌకర్యాలున్నా సర్కారీ దవాఖానకు నో

వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాలతో వెల్లడి


హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్స కోసం రాష్ట్ర ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతున్నారా ? ‘డబ్బులు పోయినా పర్వాలేదు.. ప్రాణాలు ముఖ్యం’ అనే ధోరణితోనే ప్రైవేటుకు క్యూ కడుతున్నారా ? ఈ ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు ఔననే సమాధానమే చెబుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందిన కొవిడ్‌ రోగుల వివరాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని సర్కారు చెబుతున్నా.. ఎక్కువ శాతం మంది రోగులు అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక స్థోమత లేకపోయినా ప్రాణాలు నిలుపుకొనేందుకు ప్రైవేటులోనే చేరిపోతున్నారు. 


సెప్టెంబరు 5 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,730 మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4,456 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. అంటే 62 శాతం మంది ప్రైవేటులో.. 38 శాతం సర్కారీ దవాఖానల్లో ఉన్నారన్న మాట. ఇప్పుడే కాదు.. గత నెల రోజుల గణాంకాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. సరిగ్గా రెండు వారాల క్రితం (ఆగస్టు 22న) కూడా ప్రభుత్వ దవాఖానాల్లో 2,389 మంది (37 శాతం), ప్రైవేటులో 4,066 మంది (63 శాతం) ఉన్నారు. దానికి 15 రోజులు ముందు (ఆగస్టు 8న)  కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ఆ తేదీ నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,542 మంది (38 శాతం), ప్రైవేటులో 4,196 మంది (62 శాతం) చికిత్స పొందడం గమనార్హం. ఈ లెక్కన.. గత నెల రోజుల వ్యవధిలో ప్రైవేటులో చికిత్సపొందుతున్న కొవిడ్‌ రోగులు సగటున 62 నుంచి 65 శాతం మంది ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న వారు 37 శాతంలోపేనని తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 20,396 పడకలు ఉండగా, సెప్టెంబరు 4 రాత్రి సమయానికి వాటిలో కేవలం 2730 మంది రోగులే చికిత్స పొందుతున్నారు. మరో 17666 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. అంటే సర్కారీ దవాఖానాల పడకలు 10 శాతానికి మించి రోగులతో భర్తీ కావడం లేదు. ఇక రాష్ట్రంలోని మొత్తం 192 ప్రైవేటు ఆస్పత్రుల్లో 10,253 పడకలు ఉండగా, ప్రస్తుతం 4,456 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటులోని పడకల్లో దాదాపు 45 నుంచి 50 శాతం నిండుతుండటం గమనార్హం. 


జిల్లాల్లో తీరు వేరు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల భర్తీ లెక్క హైదరాబాద్‌లో ఒక విధంగా, జిల్లాల్లో మరో విధంగా ఉంది. జిల్లాల్లో ఇప్పటికి ఒకటో, రెండో సర్కారీ ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్స జరుగుతుండగా, ప్రైవేటులో మాత్రం బెడ్స్‌ ఖాళీగా ఉండటంతో వాటివైపు ప్రజలు వెళ్తున్నారు. నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని సర్కారీ దవాఖానాల్లో కరోనా రోగికి బెడ్‌ దొరకడమంటే లాటరీ కొట్టినంత పనవుతోంది. ఈనేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రైవేటుకు కొవిడ్‌ రోగులు క్యూ కడుతున్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులు ప్రైవేటులో చేరేందుకే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికీ కొన్నిచోట్లే లిక్విడ్‌ ఆక్సిజన్‌ వ్యవస్థ ఉండటం, ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వంటి అసౌకర్యాలు సర్కారీ దవాఖానాలపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతికూలంగా మారుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

Updated Date - 2020-09-06T10:43:01+05:30 IST