రాష్ట్రంలో 61 కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-04-14T09:38:47+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు కంగారెతిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదవగా.. వైరస్‌ కారణంగా ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 592కు చేరుకోగా.. మృతుల సంఖ్య

రాష్ట్రంలో 61 కొత్త కేసులు

  • హైదరాబాద్‌లోనే 34 
  • మొత్తం 592కు చేరిన పాజిటివ్‌లు
  • సగటున రోజుకు 38 కేసులు నమోదు
  • కరోనాతో ఒకరు మృతి... మొత్తం 17


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు కంగారెతిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదవగా.. వైరస్‌ కారణంగా ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 592కు చేరుకోగా.. మృతుల సంఖ్య 17కు చేరింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు 495 కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 38 కేసుల చొప్పున వచ్చాయి. ఇక మార్చిలో ఆరుగురు మాత్రమే చనిపోగా ఏప్రిల్‌లో 13 రోజుల్లోనే 11 మంది చనిపోయారు. అంటే ఈ నెలలో మరణాల రేటుతో పాటు కేసుల శాతం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ 3న 75 కేసులు, 5న 62 కేసులు నమోదవగా సోమవారం 61 పాజిటివ్‌లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే 34 కేసులున్నాయి. చార్మినార్‌ ప్రాంతం నుంచి ఒకే కుటుంబంలో 13 కేసులు వచ్చాయి. కొత్త కేసుల్లో నగరానికి చెందిన ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో ఒక టెక్నీషియన్‌ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి నుంచి కొత్తగా ఒక కేసు నమోదవగా, వికారాబాద్‌ జిల్లాలో 4 కేసులు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఒక కేసు, నిజామాబాద్‌ జిల్లాలో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో తల్లి(60), కుమారుడు(31)కి వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటి వరకు ఆ కుటుంబంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. సంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన ఏడేళ్ల బాలుడికి వైరస్‌ సోకింది. బాలుడి తండ్రి గత నెల 16న స్విట్జర్లాండ్‌ నుంచి నగరానికి వచ్చారు. స్వీయ క్వారంటైన్‌లో ఉండి.. ఈ నెల 1న ఇంటికి వెళ్లారు. 5వ తేదీ నుంచి ఆయన కుమారుడికి జ్వరం, జలుబు రావడం గమనార్హం. కాగా ఇప్పటివరకు కరోనా నుంచి 103 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 246 కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించారు. వాటి పరిధిలోని 6,41,194 ఇళ్లలోని 27,32,644 మంది ప్రజలను సర్వే చేశారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడ ఎక్కువగా దృష్టిపెట్టారు. గ్రేటర్‌ పరిధిలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా 30 సర్కిళ్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు డీఎంహెచ్‌వో స్థాయి కలిగిన వైద్యులను రంగంలోకి దింపారు.


మెడికల్‌ ప్రొఫెసర్‌కు కరోనా

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌కు వైరస్‌ సోకింది. అత్తాపూర్‌లో నివసించే ప్రొఫెసర్‌(47) విదేశాలకు వెళ్లివచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు పనిచేసే వైద్య సిబ్బందిని, డ్రైవర్‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచారు.


కరోనా మరణాలు

చంచల్‌గూడకు చెందిన ఓ వ్యక్తి(69) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం అతన్ని కోఠి ఆస్పత్రికి తీసుకురాగా, సోమవారం చనిపోయాడు. అతడి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. మృతుడు గత నెలలో గుజరాత్‌కు వెళ్లివచ్చినట్లు గుర్తించారు.


గ్రేటర్‌పై కరోనా కన్నెర్ర 

గ్రేటర్‌ హైదరాబాద్‌పై కరోనా కన్నెర్ర చేస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం నగరానికి చెందినవే ఉంటున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్‌ల సంఖ్య 182కు చేరింది. శివారు ప్రాంతాల్లో మరో 70 మంది ఉన్నారు. కంటైన్మెంట్‌ కేంద్రాలు కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 246 కేంద్రాలుండగా.. హైదరాబాద్‌లోనే 126 ఉండడం గమనార్హం. పాజిటివ్‌ కేసులన్నీ ఈ నెల మొదటి నుంచే ఎక్కువయ్యాయి. ఈ నెల 2న కేవలం 49 కేసులుండగా.. తర్వాత పది రోజుల్లో 136 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లో ఇప్పటి వరకు 50 మందికి పైగా డిశ్చార్జ్‌ అయ్యారు. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారిపై దృష్టిపెట్టిన యంత్రాంగం ఇప్పుడు మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిపై ప్రత్యేకంగా నజర్‌ పెట్టింది.


ఇప్పటి వరకు జిల్లాల వారీగా డిశ్చార్జి అయిన వారు

గ్రేటర్‌ హైదరాబాద్‌ 216; నిజామాబాద్‌ 35; రంగారెడ్డి 20; వికారాబాద్‌ 24; వరంగల్‌ అర్బన్‌ 21; జోగులాంబ 20; సూర్యాపేట 20; మేడ్చల్‌ 18; నిర్మల్‌ 18; కరీంనగర్‌ 4; నల్లగొండ 12; ఆదిలాబాద్‌ 11; మహబూబ్‌నగర్‌ 10; కామారెడ్డి 8; ఖమ్మం 7; సంగారెడ్డి 6; మెదక్‌ 3; భద్రాది కొత్తగూడెం 2; జయశంకర్‌ 3; కొమరంభీం 3; నాగర్‌ కర్నూల్‌ 2; జగిత్యాల 2; ములుగు 2; పెద్దపల్లి 2; మహబూబాబాద్‌ 1; సిద్దిపేట 1; సిరిసిల్ల 1

Updated Date - 2020-04-14T09:38:47+05:30 IST