ఒక్కరోజే 6కేసులు

ABN , First Publish Date - 2020-03-23T09:18:51+05:30 IST

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27కు

ఒక్కరోజే 6కేసులు

నలుగురు తెలంగాణ, ఇద్దరు ఏపీకి చెందినవారు

సికింద్రాబాద్‌ వ్యాపారి భార్యకూ కరోనా పాజిటివ్‌

లోకల్‌ కాంటాక్టుగా ఒకే కుటుంబంలో ముగ్గురికి

మరో 8 మంది అనుమానిత లక్షణాలతో గాంధీకి

ఏడుగురు ఆదివారం దుబాయ్‌ నుంచి వచ్చినవారే


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27కు చేరింది. కొత్తగా నమోదైన ఆరు కేసుల్లో ఒకటి లోకల్‌ కాంటాక్టు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దుబాయ్‌ వెళ్లి వచ్చిన సికింద్రాబాద్‌ వ్యాపారి భార్య (50)కు కూడా కరోనా సోకింది. అయితే ఆమె కూడా దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీరి కుమారుడికి పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఈ వైరస్‌ సోకినట్లయింది. ఇక మిగిలిన కేసుల విషయానికి వస్తే.. ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ యువకుడు (21) లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. కరోనా పాజిటివ్‌ వచ్చింది.


ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు చెందిన మరో వ్యక్తి(23) కూడా లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకోగా అతనికీ కరోనా సోకినట్లు తేలింది. మరో పాజిటివ్‌ కేసును ఏపీలోని రాజోలుకు చెందిన ఐటీ విద్యార్థి(26)గా గుర్తించారు. ఇతడు ఈ నెల 16న స్వీడన్‌ నుంచి వచ్చాడు. స్వీడన్‌ నుంచే ఈ నెల 14న వచ్చిన రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన మరో వ్యక్తి(34)కి కూడా కరోనా సోకింది. ఇతని భార్యకు జ్వరం వస్తుండటంతో తల్లిగారి ఊరికి వెళ్లిన ఆమెను పరీక్షల నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, లండన్‌ నుంచి ఈ నెల 18న వచ్చిన భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన యువకుడి(23)కీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ఈ కేసుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా రెండోదశకు చేరినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారు జామున దుబాయ్‌, మస్కట్‌ నుంచి వచ్చిన 39 మంది ప్రైవేటు బస్సులో వస్తుండగా పటాన్‌చెరు వద్ద పోలీసులు గుర్తించారు. పరీక్షల్లో వారికి కరోనా నెగెటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఏపీలో కరోనా రెండో దశకు చేరింది. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా మరో ఆరుగురికి వైరస్‌ సోకింది. 


మరో 8 మందికి!

రాష్ట్రంలో మరో ఎనిమిది మందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని ఆదివారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురు దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులే. శనివారం రాత్రి వీరు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. ఇక వికారాబాద్‌ జిల్లా దోమ మండలానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఆదివారం ఉదయం దుబాయ్‌ నుంచి రాగా.. అతనికి హోం క్వారంటైన్‌ ముద్ర వేసి పంపించారు. తిరిగి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫిబ్రవరి 27న మస్కట్‌ నుంచి వచ్చిన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన మరో వ్యక్తి (40)ని తొలుత హోం క్వారంటైన్‌కు పంపగా.. ఆదివారం అతణ్ని కూడా గాంధీ ఆస్పత్రిలో  చేర్చారు.  

Updated Date - 2020-03-23T09:18:51+05:30 IST