‘ఢిల్లీ’ టెన్షన్...

ABN , First Publish Date - 2020-04-01T14:31:28+05:30 IST

ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన మత సదస్సుకు హాజరైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఇదే సదస్సులో పాల్గొన్న ఇండోనేషియా వాసుల వల్ల...

‘ఢిల్లీ’ టెన్షన్...

మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి కోసం గాలింపులు

ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 52 మంది హాజరైనట్టు గుర్తింపు

పాల్గొన్న వారిలో పలువురికి కరోనా పాజిటివ్‌.. 

ఇప్పటికే హైదరాబాద్‌లో ఆరుగురి మృతి

18 మంది ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు

హోం క్వారంటైన్‌లో పలువురు.. ఒకరు గాంధీకి తరలింపు

మిగతా వారి కోసం వేట

తప్పుడు సమాచారంతో తప్పించుకుంటున్న యాత్రికులు

స్వచ్ఛందంగా సంప్రదించాలి అంటున్న అధికారులు

ప్రజలకు తెలిస్తే వెంటనే చెప్పాలని సూచన


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన మత సదస్సుకు హాజరైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఇదే సదస్సులో పాల్గొన్న ఇండోనేషియా వాసుల వల్ల కరీంనగర్‌లో కరోనా కలకలం చెలరేగింది. ఇండోనేషియా వాసులకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ సదస్సులో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో ఢిల్లీ సదస్సులో పాల్గొన్న వారికోసం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 52 మంది ఉన్నట్లు గుర్తించారు.. ఇంకా ఎక్కువ మందే హాజరై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.. ఇందులో భాగంగానే మంగళవారం 18 మందిని గుర్తించి ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగిలిన వారికోసం  స్టేట్‌ ఇంటిలిజెన్సీ, సెంట్రల్‌ ఇంటలిజెన్సీ, స్థానిక పోలీసులు, వైద్య, రెవిన్యూ అధికారులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.


ఆపరేషన్‌ ఢిల్లీ..

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలో ఢిల్లీ సదస్సు కీలక పాత్ర పోషించినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చి నెల 16,17, 18.. మూడు రోజుల పాటు ఢిల్లీలో మతపరమైన కార్యక్రమం జరిగింది. ఇటీవల కరోనా మృతి చెందిన ఆరుగురు అందులో పాల్గొనవారే.  దీంతో ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 మంది ఢిల్లీ సదస్సుకు హాజరైనట్లు తేలింది. వీరిలో అర్బన్‌ జిల్లా నుంచి 38, మహబూబాబాద్‌ నుంచి 6, జనగామ నుంచి 4, ములుగు నుంచి 2, భూపాలపల్లి నుంచి1, వరంగల్‌ రూరల్‌ నుంచి 1 చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఒక్క రోజే ఇందులో 18 మందిని గుర్తించి ఎంజీఎం కోవిడ్‌ -19 ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కరోనా పరీక్షల నిమిత్తం వారి శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.


వరంగల్‌ నగరం నుంచే ఎక్కువ మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. నగరంలోని మండిబజార్‌, చార్‌బౌళి ఎల్‌బీనగర్‌, నిజాంపుర, శంభునిపేట, రంగంపేటతో పాటు హన్మకొండలోని బొక్కలగడ్డ, అలంకార్‌, ఉజిలీబేస్‌ ప్రాంతాల నుంచి ఈ సదస్సుకు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్‌ జిల్లాలో 6 మందిని గుర్తించగా ముగ్గురిని ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించారు. కరోనా నిర్ధారణకు శాంపిల్స్‌ హైదరాబాద్‌కు పింపించారు. వారికి కరోనా లేదని ఇటీవలనే నివేదికలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.


విమాన ప్రయాణ వివరాలు, రైలు ప్రయాణాలకు సంబందించి టికెట్లల్లో పొందుపరచిన వాటి ఆధారంగా వారి అడ్రస్‌లు.. ఇంటి నెంబర్‌లతో సహా గుర్తించారు. 18 మందిని ఎంజీఎంకు తరలించారు. మిగిలిన వారు సహకరించడం లేదని అధికారులు అంటున్నారు. వారి ఇళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తాము బాగానే ఉన్నామని ఫోన్‌లోనే సమాధానం చెబుతున్నట్టు అధికారులు అంటున్నారు. తాము స్థానికంగా లేమంటూ, తొందరలోనే కలుస్తామని అంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ యాత్రికులు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి ఐసోలేషన్‌ వార్డుల్లో చేరాలని అధికారులు కోరుతున్నారు. తప్పించుకుకొని తిరిగితే కఠినంగా వ్యవహరించేందుకు అధికారులు సిద్దపడుతున్నారు.


ఎంజీఎంకు 18 మంది

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత సదస్సుకు హాజరైన వారిని ఒక్కొక్కరిని గుర్తిస్తున్నారు. స్థానికంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల ద్వారా వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చుతున్నారు. జిల్లా యంత్రాంగం గుర్తించిన 18 మందిలో సీకేఎం ఆస్పత్రి - 5, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి - 02, ఎంజీఎం-02 , కాశీబుగ్గ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ -02, రంగశాయి పేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌-01, వడ్డెపల్లి -01, దేశాయిపేట-01, శాయంపేట 01, పెద్దమ్మ గడ్డ-01, కొండపర్తి -01, హసన్‌పర్తి-01లతో కలిపి మొత్తం 18 మంది ఉన్నారు.

Updated Date - 2020-04-01T14:31:28+05:30 IST