భూమిలో 52 కిలోల డ్రగ్స్‌

ABN , First Publish Date - 2020-08-20T09:20:36+05:30 IST

హైదరాబాద్‌ శివారు జిన్నారంలోని ఓ పరిశ్రమలో భారీగా డ్రగ్స్‌ లభ్యమైన కేసులో ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. నిఘా వర్గాలు, పోలీసుల నుంచి

భూమిలో 52 కిలోల డ్రగ్స్‌

  • పరిశ్రమలో పాతిపెట్టిన దుండగులు
  • డీఆర్‌ఐ అధికారుల విచారణలో వెల్లడి
  • రూ.6కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం

హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారు జిన్నారంలోని ఓ పరిశ్రమలో భారీగా డ్రగ్స్‌ లభ్యమైన కేసులో ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. నిఘా వర్గాలు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు పరిశ్రమ లోపల భూమిలో డ్రగ్స్‌ పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాతిపెట్టిన 52.5 కిలోల డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అఽధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 45 కిలోల ఎఫిడ్రీన్‌, 7.5 కిలోల మెఫెడ్రోన్‌ ఉంది. వీటి విలువ సుమారు రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.


విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారంతో ఓ పరిశ్రమ ఆవరణలో తవ్వకాలు జరపగా.. ప్లాస్టిక్‌ బ్యాగుల్లో ఉంచిన డ్రగ్స్‌ లభ్యమైనట్లు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌ శివారులోని ఓ పరిశ్రమలో గుట్టుగా డ్రగ్స్‌ తయారు చేసి.. అక్రమంగా తరలిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును డీఆర్‌ఐ మూడు రోజుల క్రితం రట్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి విదితమే. 


షెల్టర్‌ జోన్‌గా హైదరాబాద్‌?

కొవిడ్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడం, ఆఫ్రికా, యూరప్‌ దేశాల నుంచి డ్రగ్స్‌ సరఫరా తగ్గిపోవడంతో దేశంలోనే డ్రగ్స్‌ ఉత్పత్తికి నిందితులు పూన్నుకున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా దేశంలో, అవకాశముంటే ఇతర దేశాలకు సైతం మాదకద్రవ్యాలు పంపించడానికి సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసులు నమోదవుతున్నా అధికారులు అంత సీరియ్‌సగా తీసుకోకపోవడంతో డ్రగ్స్‌ తయారీదారులు హైదరాబాద్‌ను తమ షెల్టర్‌గా వాడుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే అవకాశాలు తగ్గడంతో ఇక్కడే ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డీఆర్‌ఐ విచారణలో మరిన్ని ఉత్పత్తి కేంద్రాలు, కొత్త పాత్రధారులు, సూత్రధారులు తెరపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

Updated Date - 2020-08-20T09:20:36+05:30 IST