50 వేల మందికి మందులు రెడీ

ABN , First Publish Date - 2020-06-04T09:02:49+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం

50 వేల మందికి మందులు రెడీ

  • 100 రోజులకు సరిపడా సిద్ధం చేసిన ప్రభుత్వం
  • 42 కోట్లతో 54 రకాల మందుల కొనుగోలు
  • జూలై చివరికి  60 వేల కరోనా కేసులు? 
  • అదే అంచనాతో సర్కారు సన్నద్ధం
  • మరో 322 వెంటిలేటర్లకు ఇండెంట్‌
  • 5వేల పడకలకు ఆక్సిజన్‌ సరఫరా లైన్లు
  • పీహెచ్‌సీ స్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్లు
  • కరోనా చికిత్సకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సిద్ధంగా పడకలు


హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. 50 వేల మంది రోగులకు అవసరమయ్యే మందులను 100 రోజులకు సరిపడా ముందస్తుగా నిల్వ పెట్టుకుంది. కేసుల సంఖ్య మరింత పెరిగితే జిల్లా ఆస్పత్రుల్లోనూ చికిత్స అందించేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాటిజివ్‌ కేసుల ట్రెండింగ్‌ ప్రకారం.. జూలై చివరి నాటికి రాష్ట్రంలో 60 వేల కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం కూడా సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. మందులు, ఇతర ఏర్పాట్ల కోసం రూ.400 కోట్ల పైచిలుకు నిధులకు సర్కారు పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఇక కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్సలో భాగంగా వాడే మందులను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే సేకరించి పెట్టుకుంది.


వైరస్‌ సోకిన వారికి.. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 54 రకాల మందులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిలో సాధారణ లక్షణాలున్నవారికి ఇచ్చేవి, వెంటిలేటర్స్‌పై ఉన్నవారికి ఇచ్చేవి ఉన్నాయి. రూ.42 కోట్లతో దాదాపు 50 వేల మంది రోగులకు అవసరమైన మందులను వంద రోజులకు సరిపడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో ప్రధానంగా ఐవీ ఫ్లూయిడ్స్‌, డ్రగ్స్‌ అండ్‌ కన్స్యుమబుల్స్‌, యాంటీ బయోటిక్స్‌ ఉన్నాయి. ఇక మున్ముందు కరోనా కేసులు భారీగా పెరిగితే ఆక్సిజన్‌ సరఫరాకు ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ తయారు చేసే 14 మంది ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకుంది. వారు ఏ మేరకు ఉత్పత్తి చేయగలుగుతారు? మన అవసరాలు ఎంత ఉంటాయన్న దానిపైనా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. వీరిలో రోజుకు 300 సిలిండర్ల  నుంచి 1000 సిలిండర్ల వరకు తయారు చేసేవారు ఉన్నారు. అందులో పెద్ద, చిన్న సిలిండర్లు ఉన్నాయి. 


మందుల నిల్వలపై ఆరాకు సాఫ్ట్‌వేర్‌

టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ వద్ద సాధారణంగా వంద రోజులకు సరిపడా మందుల నిల్వలుంటాయి. రాష్ట్రంలో మొత్తం 46 ఆస్పత్రులు, 9 కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌లకు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ  ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, రీజెన్స్‌ సరఫరా చేస్తుంది. వీటిలో కనీసం 50 రోజులకు తగ్గకుండా అవసరమైన నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ నిల్వల నుంచి ఎప్పటికప్పుడు ఎంత వాడారన్న విషయంపై ప్రత్యేక సాప్ట్‌వేర్‌ ద్వారా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ సమాచారం అందుతుంది. 50 రోజుల అవసరాలకు సరిపడా మందుల్లో ఏవి తగ్గినా ఈ సాఫ్ట్‌వేర్‌ వెంటనే టీఎ్‌సఎంఎ్‌సఐడీసీని అలర్ట్‌ చేస్తుంది. దాని ఆధారంగా వారు మందులను వెంటనే ఆస్పత్రులకు, నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్స్‌కు పంపిస్తారు. 


అందుబాటులో పెట్టుకున్నవి ఇవే..

సిద్ధంగా 400 వెంటిలేటర్లు. మరో 322 వెంటిలేటర్లకు ఇండెంట్‌.  7.5 లక్షల పీపీఈ కిట్లు. 11.40 లక్షల ఎన్‌-95 మాస్కులు.

అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్లు 75 లక్షలు, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ 41 లక్షలు. వీటితోపాటు లేపనోవీర్‌, రేటీనోవీర్‌, ఒసాల్లోమావీర్‌ ట్యాబ్లెట్లు నిల్వ.

ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు 50 లక్షలు

5 వేల పడకలకు ఆక్సిజన్‌ సరఫరా లైన్ల ఏర్పాటు (ఇప్పటిదాకా ఐసీయూ బెడ్స్‌కు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా ఉండేది).

రాష్ట్రవ్యాప్తంగా 668 పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఆక్సిజన్‌ సిలిండర్లు. కరోనా బాధితులకు లెవల్‌-1 కింద ఇప్పటికే 14 వేల పడకలు సిద్ధం.

లెవల్‌-2, లెవల్‌-3 కింద ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా చికిత్సకు సిద్ధంగా ఉన్న పడకలు.

13 జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైతే కరోనా రోగుల చికిత్సకు ఏర్పాట్లు.

పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, వెంటిలేటర్లు, మందుల సరఫరాకు రేటు కాంట్రాక్టును ఖరారు చేసుకున్న టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ 

మందుల కొనుగోలు, కన్య్సూమబుల్స్‌, డిస్పోజల్‌, 

ఇతర లాగిస్టిక్స్‌ కోసం రూ.349.97 కోట్ల కేటాయింపు. 


32 వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు

రాష్ట్రంలో ఇప్పటికి 32వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశారు. ఎప్పటికప్పుడు అవసరమైన ఇండెంట్‌ను ఐసీఎంఆర్‌కు ప్రభుత్వం పెట్టింది. ప్రస్తుతం 10 వేలకు పైగా కిట్లను అందుబాటులో ఉంచుకుంది. తెలంగాణ కోసం 3 లక్షల ఆర్టీపీసీఆర్‌ కిట్లను ఇస్తామని ఐసీఎంఆర్‌ తెలపగా.. వాటన్నింటిని ప్రభుత్వం తమ అవసరాలకనుగుణంగా తెప్పించుకుంటోంది. 

Updated Date - 2020-06-04T09:02:49+05:30 IST