‘కరోనా’కు 5 వేల పడకలు
ABN , First Publish Date - 2020-03-13T10:01:12+05:30 IST
కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృత రూ పం దాలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన 5 వేల పడకలను అందుబాటులో

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృత రూ పం దాలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన 5 వేల పడకలను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులపైనే ఆధారపడకూడదని నిర్ణయిం చింది. మరోవైపు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణవాసులు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. వారిని తీసుకొచ్చే బాధ్యత తమది కాదని, కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇటలీకి రవాణా సౌకర్యాలు బంద్ కావడంతో ఎంఎస్ చేసేందుకు అక్కడికెళ్లిన తెలంగాణ విద్యార్థులు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. భారత్ రావాలనుకుంటున్న 66 మంది తెలంగాణ విద్యార్థులకు ఇటలీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణతో పాటు కేరళ, బెంగళూరు, నాగపూర్‌కు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. కరోనా నెగెటివ్ వైద్య ధ్రువపత్రాన్ని సమర్పిస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కేసీఆర్ సర్కారు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి విదేశాల నుంచి రోజూ 3000-3500 మంది వస్తున్నారు. అందులో 50-60 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తిస్తున్నారు. 25-30 మందిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. మిగిలిన వారిని ఇళ్ల వద్దే ఐసోలేషన్ చేస్తున్నారు. కొందరిలో తొలుత లక్షణాలు కనబడనప్పటికీ తర్వాత బయటపడుతున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారినందరినీ ఇంటి వద్దే 14 రోజుల పాటు ఐసోలేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన కర్నూలుకు చెందిన నిట్ విద్యార్థి అష్ఫాఖ్ జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతుండటంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. శ విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి(26)కి వైరస్ అనుమానంతో ఫీవర్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శానిటైజేషన్‌ను ముమ్మరం చేశారు. కరోనా భయంతో ప్రజలు బయటికి వెళ్లకపోవడంతో రాష్ట్ర పర్యాటకం పడకేసింది. దుబాయ్ నుంచి వచ్చిన విశాఖపట్నం జిల్లా కొత్తూరుకు చెందిన ఓ యువకుడిని కరోనా అనుమానంతో ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించారు. దుబాయ్ నుంచి మరో ఇద్దరు యువకులు కూడా కొత్తూరుకు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్రంలో మాస్క్‌లను తయారు చేసి తెలుగు రాష్ట్రాలకు రూ.10కే సరఫరా చేస్తున్నారు.