ఒక్క రోజే 546 కేసులు

ABN , First Publish Date - 2020-06-21T08:25:27+05:30 IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా శనివారం మరో 546 మంది వైరస్‌ బారినపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 458 ...

ఒక్క రోజే 546 కేసులు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 458
  • రంగారెడ్డిలో 50, జిల్లాల్లో 38
  • రాష్ట్రంలో 7 వేలు దాటిన కేసులు
  • చిన్నారి సహా ఐదుగురి మృతి
  • దేశ వ్యాప్తంగా 14 వేల కేసులు
  • మొత్తం 4లక్షలమంది బాధితులు
  • 13 వేలకు చేరిన మరణాలు
  • రాష్ట్రంలో మొత్తం 7 వేలు దాటిన కేసులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా శనివారం మరో 546 మంది వైరస్‌ బారినపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 458 కేసులు నమోదవగా, రంగారెడ్డిలో 50, కరీంనగర్‌లో 13, జనగామలో 10, మేడ్చల్‌లో 6, మహబూబ్‌నగర్‌లో 3, వరంగల్‌ రూరల్‌, ఖమ్మంలో రెండేసి, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజాగా వచ్చిన పాజిటివ్‌లతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 7,072కు చేరగా, రాజధానిలోనే ఐదు వేలకు చేరింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 3,188 నమూనాలను సేకరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తంగా 53,757 టెస్టులు నిర్వహించారు. శనివారం 154 మంది కోలుకోగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. 3,363 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో శనివారం ఐదుగురు మరణించారు.


ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మన్‌కు..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌లో ఒకరికి(45) కరోనా సోకింది. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షల్లో పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రాజాసింగ్‌, ఆయన పీఏ, మరి కొందరు సిబ్బంది నమూనాలను సేకరించారు. 


పోలీస్‌ అకాడమీలో ఒకరికి..

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణా కేంద్రం(టీఎ్‌సపీఏ)లోని డైరెక్టర్‌ బ్లాక్‌లో పని చేసే అటెండర్‌కు పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. అటెండర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌పై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అకాడమీలో సుమారు 2 వేల మంది శిక్షణ పొందుతున్నారు. అకాడమీలో భౌతిక దూరానికి ఆస్కారం లేకుండా పోతుందన్న విమర్శలున్నాయి.


  1. వికారాబాద్‌ జిల్లాలో కరోనా సోకిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందాడు.
  2. నిజామాబాద్‌కు చెందిన ఇద్దరికి, బోధన్‌కు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కామారెడ్డి పట్టణంలో ఇద్దరు, సదాశివనగర్‌ మండలం మల్లుపేటలో మరొకరు కరోనా బారినపడ్డారు. 
  3. సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(55)కు కరోనా సోకగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అలాగే, హత్నూర మండలం మంగాపూర్‌కు చెందిన మూడు నెలల చిన్నారి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు చిన్నారి నమూనాలను పరీక్షలకు పంపగా.. శనివారం పాజిటివ్‌ వచ్చింది.
  4. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఓ హోంగార్డు, మర్లు ప్రాంతంలో ఇద్దరికి, దివిటిపల్లిలో ఓ పోలీసు అధికారికి కరోనా సోకింది.
  5. ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైల్వే ఉద్యోగులకు, పాల్వంచ కేటీపీఎ్‌సలో ఇంజనీర్‌గా పని చేస్తున్న వ్యక్తిక పాజిటివ్‌ వచ్చింది. బూర్గంపాడు మండలంలో గోల్డ్‌ షాపు యజమానికి కరోనా నిర్ధారణ అయింది.
  6. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కరోనా బారిన పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెదారు.

Updated Date - 2020-06-21T08:25:27+05:30 IST