‘లా’ ప్రవేశాలకు 45% నిబంధన అడ్డు
ABN , First Publish Date - 2020-12-06T08:14:11+05:30 IST
లాసెట్‌లో అర్హత సాధించి న్యాయ విద్యలో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధన ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంటర్‌లో అత్యధిక విద్యార్థుల మార్కులు 35 శాతమే
మినహాయింపు ఇవ్వాలంటున అభ్యర్థులు
హైదరాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): లాసెట్‌లో అర్హత సాధించి న్యాయ విద్యలో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధన ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధిస్తేనే లాసెట్ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు. ఎంసెట్‌లోనూ ఇలాంటి నిబంధన ఉండగా.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. తమకు కూడా మినహాయింపు ఇవ్వాలని లాసెట్ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటర్‌లో 45ు సాధిస్తేనే..
ఇంటర్ తర్వాత లాసెట్‌లో అర్హత సాధించినవారు ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరేందుకు అర్హులు. అలాగే డిగ్రీ పూర్తి చేస్తే మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో చేరవచ్చు. అయితే వీరు లాసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్/డిగ్రీలో కనీసం 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40ు రావాలి. ఈ మేరకు 2009 మార్చి 18న ప్రభుత్వం విడుదల చేసిన జీవోఎంఎస్-31 స్పష్టం చేస్తోంది. ఈసారి లాసెట్‌లో మూడేళ్ల కోర్సుకు 12,103 మంది, ఐదేళ్ల కోర్సుకు 2,477 మంది అర్హత సాధించారు.
కరోనా నేపథ్యంలో ఈసారి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. ఫెయిలైనవారందరినీ కనీస ఉత్తీర్ణతకు కావాల్సిన 35ు మార్కులను కలిపి పాస్ చేసింది. వీరు లాసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఇంటర్‌లో 45ు మార్కుల నిబంధన ప్రకారం కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. లాసెట్ ప్రవేశాల కమిటీ నాలుగైదు రోజుల్లో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. కౌన్సెలింగ్ తేదీలను కూడా ఇందులోనే నిర్ణయించనున్నారు.
ఈలోపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తే తప్ప నిబంధనలు మారే అవకాశాల్లేవు. ఇదే జరిగితే లాసెట్‌లో అర్హత సాధించిన అనేకమందికి అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు పాపిరెడ్డితో ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చినట్టు లాసెట్ అభ్యర్థులకూ మినహాయింపు లభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.