మూడో రోజూ.. వరద జోరు

ABN , First Publish Date - 2020-09-29T07:20:31+05:30 IST

కృష్ణమ్మ సోమవారం కూడా పరవళ్లు తొక్కింది. జూరాల జలాశయానికి 2 లక్షల 12వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 26 గేట్ల ద్వారా 1,78,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి మొత్తం 2,04,169

మూడో రోజూ.. వరద జోరు

  • సాగర్‌కు 5.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • శ్రీశైలం, జూరాలకు కొనసాగుతున్న వరద
  • ఎస్సారెస్పీకి 1.69 లక్షల క్యూసెక్కుల నీరు
  • మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తుతున్న ప్రవాహం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కృష్ణమ్మ సోమవారం కూడా పరవళ్లు తొక్కింది.  జూరాల జలాశయానికి 2 లక్షల 12వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 26 గేట్ల ద్వారా 1,78,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి మొత్తం 2,04,169 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,64,401 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, పది గేట్లు ఎత్తి 5,04,636 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 883.80 (208.7 టీఎంసీలు) అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్‌కు 5,20,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 20 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు (312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.60 అడుగులుగా (310.8 టీఎంసీలుగా) ఉంది. సాగర్‌ నుంచి  6,03,427 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పులిచింతలకు 4,15,641 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.17 గేట్లను ఎత్తి 5,78,002 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయంలోకి కరకట్ట లీకేజీ ద్వారా కృష్ణా నది నీరు వస్తోంది. పులిచింతల గేట్లు మూస్తే మట్టపల్లి ఆలయంతో పాటు, గ్రామం కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. 


కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న ఉధృతి

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి 1,69,885 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 34 గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఎగువన వర్షాలతో కరీంనగర్‌ ఎల్‌ఎండీ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు వరద పెరుగుతుండటంతో గేట్లను ఎత్తారు. దీంతో కాళేశ్వరం వద్ద సోమవారం గోదావరి 8.71 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 4.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 46 గేట్లను ఎత్తి 4.07 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2020-09-29T07:20:31+05:30 IST