రూ.3వేల కోట్లకు మించి ‘ఉపాధి’

ABN , First Publish Date - 2020-05-18T09:23:49+05:30 IST

కరోనా ప్యాకేజీల్లో భాగంగా ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40వేల కోట్లను కేంద్రం కేటాయించింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి బహుళ ప్రయోజనం కలగనుంది. కూలీలకు కావాల్సినంత పని కల్పించడంతో

రూ.3వేల కోట్లకు మించి ‘ఉపాధి’

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్యాకేజీల్లో భాగంగా ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40వేల కోట్లను కేంద్రం కేటాయించింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి బహుళ ప్రయోజనం కలగనుంది. కూలీలకు కావాల్సినంత పని కల్పించడంతో పాటు శాశ్వత ఆస్తుల కల్పనకు దోహదపడనుంది. 2020-21 బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి రూ.60వేల కోట్లకుపైగా నిధులను కేంద్రం కేటాయించగా.. ప్రస్తుత అదనపు నిధులతో ఈ మొత్తం రూ.లక్ష కోట్లు దాటనుంది. ఇందులో రూ.3వేల కోట్లకు పైగా నిధులను తెలంగాణ వినియోగించుకునే వీలుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది రూ.1000 కోట్లకుపైగా నిధులను అదనంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఏటా రూ.2,000కోట్లకు పైగా విలువైన ఉపాధి పనులు జరుగుతున్నాయి. సగటున 10కోట్ల పని దినాలు అందుబాటులో ఉంటున్నాయి.  ప్రస్తుత ప్యాకేజీతో ఈ పనిదినాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. అలాగే, ఒక కుటుంబానికి గరిష్ఠంగా వంద రోజుల పని కల్పిస్తారు. ఈ పరిమితిని దేశవ్యాప్తంగా సడలించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదనంగా 50 లేదా 100 రోజుల పాటు పని కల్పిస్తారని తెలిసింది. మెరుగైన ఉపాఽధి, వేతనం కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కరోనా ప్రభావంతో స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు చేరుకున్నారు. వీరందరూ స్థానికంగానే ఉపాధి హామీ పనులు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త జాబ్‌ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం సైతం ఇందుకు అనుగణంగా చర్యలు చేపడుతోంది. తాజాగా కేటాయించిన అదనపు నిధులతో వీరందరికీ చేతినిండా పని దొరకనుంది.

Updated Date - 2020-05-18T09:23:49+05:30 IST