హేమంత్ పరువు హత్య కేసులో 39 పేజీల చార్జిషీటు దాఖలు
ABN , First Publish Date - 2020-12-30T11:51:07+05:30 IST
ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో

హైదరాబాద్ : ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి 39 పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన వార్షిక క్రైమ్ మీటింగ్‌లో డీసీపీ మాట్లాడారు. హేమంత్-అవంతికారెడ్డి ప్రేమవివాహం ఇష్టంలేని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పథకం ప్రకారమే హేమంత్, అవంతిలను బయటకు రప్పించారు. అనంతరం సుపారీ కిల్లర్స్‌తో హేమంత్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు.
ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు 18మంది నిందితులను అరెస్టు చేశారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించి కేవలం 86 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేశామని పీఆర్‌సీ నంబర్ 149/2020 వచ్చిందని డీసీపీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫాస్టుట్రాక్ కోర్టులో 2021 జనవరి-1న ఈ కేసు ట్రయల్‌కు రానున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులకు తప్పనిసరిగా శిక్షపడేలా సాక్ష్యాధారాలను సమర్పించినట్లు డీసీపీ పేర్కొన్నారు.