గ్రేటర్‌లో మరో 33 లింక్‌ రోడ్లు

ABN , First Publish Date - 2020-06-23T09:57:55+05:30 IST

జూలై నెలాఖరు వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మరో 33 లింక్‌/స్లిప్‌ రోడ్లు అందుబాటులోకి వస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి, దూరాభారం తగ్గించడం లక్ష్యంగా

గ్రేటర్‌లో మరో 33 లింక్‌ రోడ్లు

  • జూలై నెలాఖరుకు అందుబాటులోకి
  • లింక్‌/స్లిప్‌ రోడ్డును ప్రారంభించిన కేటీఆర్‌
  • తొలి విడతగా 37 ప్రాంతాల్లో నిర్మాణం
  • నాలుగు చోట్ల నిర్మాణ పనులు పూర్తి
  • ప్రధాన రోడ్లపై తగ్గనున్న ట్రాఫిక్‌ ఒత్తిడి
  • 126 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం
  • ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ప్రణాళిక


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జూలై నెలాఖరు వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మరో 33 లింక్‌/స్లిప్‌ రోడ్లు అందుబాటులోకి వస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి, దూరాభారం తగ్గించడం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్టు చెప్పారు. నగరంలోని 4 ప్రాంతాల్లో లింక్‌/స్లిప్‌ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌ రోడ్‌ నెంబర్‌-70లో లింక్‌ రోడ్డును సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, మాజీ సీఎ్‌సలు ఎస్‌కే జోషి, ఎస్పీ సింగ్‌ ,పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి నగరం, శివారు ప్రాంతాల్లో 137లింక్‌/స్లిప్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ రహదారులు అందుబాటులోకి వస్తే 126.2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మొదటి విడతగా 37 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులను హైదరాబాద్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ప్రారంభించింది. దాదాపు 44.67 కిలోమీటర్ల దూరం తగ్గే ఈ రహదారుల నిర్మాణానికి రూ.313.65 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తయిన 4 లింక్‌/స్లిప్‌ రోడ్ల ద్వారా 4.67 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఏ ప్రాంతాల్లో లింక్‌/స్లిప్‌ రోడ్ల నిర్మాణం అవసరం? ఎక్కడ అవకాశం ఉంది? ఎన్ని ఆస్తులు సేకరించాలన్నది జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగాలు నిర్ణయించాయి. గ్రేటర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ.. శివార్లలో హెచ్‌ఎండీఏ ఆస్తుల సేకరణ చేపడుతున్నాయి. 


పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా!

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇబ్బంది కలగకుండా లింక్‌/స్లిప్‌ రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు తక్కువ నిర్మాణ, ఆస్తుల సేకరణ వ్యయంతో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు ప్రభుత్వ విభాగాలు చెబుతున్నాయి. స్వల్పంగా ఆస్తుల సేకరణ, విస్తరణతో 80-120 అడుగులు మేర అందుబాటులోకి వచ్చే రోడ్లను గుర్తించారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలు, సర్వే నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్లు అందుబాటులోకి రావ డం ద్వారా దూరాభారంతోపాటు ఇంధన వినియోగం, వాహన కాలుష్యం తగ్గుతుంది. సమయమూ ఆదా అవుతుంది. ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకొని అలసిపోయే ఇబ్బంది ఉండదు. వాహన కాలుష్యమూ తగ్గుతుంది. వాహనదారులకు ప్రయాణం సులువుగా ఉంటుంది.  


తగ్గనున్న దూరం.. 

కారిడార్‌ 2: నిర్మించిన రోడ్డు ఒక కిలోమీటర్‌ 

నిర్మాణ వ్యయం రూ.9.61 కోట్లు

4.2 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటరుకు దూరం తగ్గుతుంది.


కారిడార్‌ 16: నిర్మించిన రోడ్డు - 2.70 కిలోమీటర్లు 

వ్యయం - రూ.14.35 కోట్లు.

7.5 కి.మీల దూరం 2.7 కి.మీల మేర తగ్గునుంది. 


కారిడార్‌ 137: నిర్మించిన రోడ్డు - 0.47 కిలోమీటర్లు 

వ్యయం - రూ.3.52 కోట్లు


కారిడార్‌ 138: నిర్మించిన రోడ్డు - 0.5 కిలోమీటర్లు 

వ్యయం - రూ.6.32 కోట్లు

 3.1 కి.మీల నుంచి దూరం 0.5 కి.మీలకు తగ్గుతుంది. 


లింక్‌/స్లిప్‌ రోడ్ల స్వరూపం..

నిర్మించనున్న లింక్‌/స్లిప్‌ రోడ్లు - 137

తగ్గనున్న దూరం - 126.2 కిలోమీటర్లు

మొదటి విడతలో నిర్మిస్తున్న రోడ్లు - 37

నిర్మాణ వ్యయం రూ.313.65 కోట్లు

తగ్గనున్న దూరం - 44.67 కిలోమీటర్లు

ప్రస్తుతం పూర్తయిన రోడ్లు - 4

తగ్గనున్న దూరం - 4.67 కిలోమీర్లు

Read more