3 నిమిషాలు ఆలస్యమై..

ABN , First Publish Date - 2020-11-26T08:13:12+05:30 IST

మూడంటే మూడు నిమిషాల ఆలస్యం, ఆ యువకుడిని పోటీ పరీక్షకు దూరం చేస్తే.. జీవితంలో స్థిరపడేందుకు ఆ పరీక్షనే నమ్ముకున్న

3 నిమిషాలు ఆలస్యమై..

ఆశలు ఛిద్రమై

 పోటీ పరీక్షకు అనుమతించలేదని యువకుడి బలవన్మరణం 

ఊర్కొండ, నవంబరు 25: మూడంటే మూడు నిమిషాల ఆలస్యం, ఆ యువకుడిని పోటీ పరీక్షకు దూరం చేస్తే.. జీవితంలో స్థిరపడేందుకు ఆ పరీక్షనే నమ్ముకున్న ఆ యువకుడు.. తన ఆశలన్నీ కల్లలయ్యాయనే మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామంలో మంగళవారం ఈ విషాదం జరిగింది. మృతుడు అదే గ్రామానికి చెందిన బగ్గి శ్రీకాంత్‌ (22). 


సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ డిల్లీ పోలీస్‌ అండ్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పరీక్ష పేపర్‌-1కు హాజరయ్యేందుకు శ్రీకాంత్‌.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తన చెల్లెలి ఇంటికి చేరుకున్నాడు. 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంది. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని ఐవోఎన్‌ డిజిటల్‌ జోన్‌, ఐడీజీ అరుణోదయనగర్‌ ప్లాట్‌ నంబరు-9లో పరీక్ష రాయడానికి ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే రిపోర్టింగ్‌ సమయం ఉంది. తన చెల్లెలి ఇంటి నుంచి శ్రీకాంత్‌ పరీక్ష కేంద్రానికి చేరుకొని రిపోర్టు చేయడంలో మూడు నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఆయనకు పరీక్షకు అనుమతి లభించలేదు.


బయటకొచ్చిన తర్వాత చెల్లెలికి శ్రీకాంత్‌ ఫోన్‌ చేశాడు. తాను కలలు కన్న పోలీసు ఉద్యోగం దూరమైందని, తన మనోవేద  ఎవరూ తీర్చలేనిదని ఆవేదన పంచుకున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి వేరే వివాహం చేసుకొని తమను పట్టించుకోలేదని.. అమ్మమ్మ, తాతయ్య, మేనమామల వద్ద ఉండి చదువుకున్నామని ఆమెతో గతాన్నంతా చెప్పుకొని బాధపడుతూ ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు.

ఆమె సాయంత్రం వరకు అన్న కోసం ఎదురుచూసి, రాకపోవడంతో మేనమామకు సమాచారం ఇచ్చింది. ఆచూకీ కోసం వెతకగా గ్రామంలోని సొంత పొలంలో శ్రీకాంత్‌ విగతజీవిగా కనిపించాడు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. 


Updated Date - 2020-11-26T08:13:12+05:30 IST