3 రోజులు.. 6,886 కోట్లు!

ABN , First Publish Date - 2020-06-25T08:13:55+05:30 IST

ఈ ఏడు రైతుబంధు విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. నియంత్రిత వ్యవసాయం పేరుతో చెప్పిన పంటలు వేస్తేనే

3 రోజులు.. 6,886 కోట్లు!

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడు రైతుబంధు విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. నియంత్రిత వ్యవసాయం పేరుతో చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించడంతో తొలుత రైతుల్లో ఆందోళన నెలకొంది. వాటన్నింటికీ తెరదించుతూ ఎలాంటి షరతులూ లేకుండా ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేసింది. 3 రోజుల వ్యవధిలో 54.21 లక్షల మంది రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రికార్డు స్థాయిలో రూ. 6,886.19 కోట్లు జమచేసింది. లబ్ధిదారుల్లో 74,084 మంది గిరిజన ప్రాంత రైతులు కూడా ఉన్నారు. వీరికి రూ. 124.23 కోట్లు చెల్లించడం గమనార్హం. ఎకరాకు రూ. 5 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.40 కోట్ల ఎకరాలకు గాను రూ.7 వేల కోట్ల కేటాయించింది. అనంతరం ఈనెల 22  నుంచి రైతులకు నగదు బదిలీ ప్రారంభించింది. ఇప్పటివరకు బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌ నెంబర్లు పక్కాగా సమర్పించిన రైతులందరికీ ఆర్థిక సహాయం అందింది. 


5 లక్షల మందికి పెండింగ్‌

పట్టాదారు పాస్‌పుస్తకాలున్న రైతులు 59.21 లక్షల మంది ఉండగా.. 54.21 లక్షల మందికి ఈ సీజన్‌కుగాను రైతుబంధు అందింది. అకౌంట్లు సక్రమంగా లేని, ఆధార్‌ అనుసంధానం కాని ఖాతాలు, ఒకే ఆధార్‌ నెంబర్‌ ఉండి పేర్లు వేరుగా ఉన్న అకౌంట్లు దాదాపు 4.50 లక్షలు ఉన్నాయి. ఈ ఏడాదే పాస్‌పుస్తకాలు తీసుకున్న రైతులు మరో 50 వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ తమ అకౌంట్లకు సంబంధించిన వివరాలు సమర్పిస్తే.. వాటిని సరిచేసి ప్రభుత్వం రైతుబంధు అందిస్తుంది. కాగా, 30 వేల మంది రైతులకు సంబంధిచిన అకౌంటు నెంబర్లు, ఐఎ్‌ఫఎ్‌ససీ నెంబర్లు సరిపోలకపోవడంతో సొమ్ము జమ కాకుండా వెనక్కి వచ్చింది. వీరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపు జరిగిపోయింది కాబట్టి సంబంధిత బ్యాంకు మేనేజర్‌ను గానీ, ఏఈవోను గానీ సంప్రదించి సరైన వివరాలు సమర్పిస్తే సరిపోతుందని వారు తెలియజేశారు. 


రైతులు ఒక్కసారిగా బ్యాంకులకు వెళ్లొద్దు 

 సుమారు 5 వేల బ్రాంచిల్లో రైతుల అకౌంట్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యిందని రైతులంతా ఒకేసారి బ్యాంకులకు వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. డబ్బులు అవసరం లేనివాళ్లు బ్యాంకులకు వెళ్లొద్దు.  ఏటీఎం కార్డులు ఉన్న రైతులు భౌతిక దూరం పాటిస్తూ డ్రా చేసుకోవాలి. 

- డా. జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి


రైతుబంధుకు ఏ ఆంక్షలూ విధించలేదు

రైతుబంధుకు ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. రికార్డుస్థాయిలో రూ. 6,886.19 కోట్లు మూడు రోజుల వ్యవధిలో అందించాం. రైతుబంధు అందని రైతుల సందేహాలను క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది నివృతి చేయాలి. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించి బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయించుకోవాలి. సరైన వివరాలు సమర్పించిన రైతులందరికీ రైతుబంధు అందుతుంది.


- నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

Updated Date - 2020-06-25T08:13:55+05:30 IST