సంద్రంలోకి 2808 టీఎంసీలు

ABN , First Publish Date - 2020-09-18T09:53:37+05:30 IST

ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ రెండు బేసిన్లలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ

సంద్రంలోకి 2808 టీఎంసీలు

  • గోదావరి నుంచి 2,564..కృష్ణా నుంచి 244
  • ఎస్సారెస్పీకి 1.1లక్షల క్యూసెక్కులు
  • సింగూరుకు జలకళ.. ప్రాజెక్టులో 11 టీఎంసీలు 
  • శ్రీశైలం 15, సాగర్‌ 18 గేట్ల నుంచి నీటి విడుదల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)  

ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ రెండు బేసిన్లలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. వస్తున్న వరదను వస్తున్నట్లుగానే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది వర్షాలు మొదలైన తర్వాత ఇప్పటి వరకు గోదావరి నుంచి 2,564 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. కృష్ణా నుంచి 244 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. గోదావరిలో సుమారు రెండు నెలల నుంచి, కృష్ణాలో గత 45 రోజుల నుంచి వరద నీరు సముద్రంలోకి వెళుతూనే ఉంది. ఇప్పటికీ ఈ రెండు నదుల్లో వరద ప్రవాహం నమోదవుతూనే ఉంది. దాంతో ఈ ఏడాది మరింత నీరు సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎస్సారెస్పీకి గురువారం 1.1లక్షల క్యూసెక్కుల వరద రాగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి 61,232 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం దాదాపు 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.89 టీఎంసీల నీరు ఉంది.


కాగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి గురువారం కూడా వరద కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 1,63,520 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 54,691 క్యూసెక్కులు, హంద్రీ నీవా నుంచి 2788 క్యూసెక్కులు, ఇతరత్రా 268 క్యూసెక్కులు వెరసి శ్రీశైలానికి మొత్తం 2,20,997 క్యూసెక్కుల వరద నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి  3,76,670 క్యూసెక్కుల నీటిని, కుడి గట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,333 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 4,07,003 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా(311.4474 టీఎంసీలుగా) ఉంది.  సాగర్‌ నుంచి మొత్తం 3,49,086 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు గురువారం ఉదయం 3,29,743 క్యూసెక్కులకు పైగా నీరు రావడంతో 13 గేట్లను ఎత్తి 3,29,743 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్‌ నీటిమట్టం 2.4 టీఎంసీల గరిష్ఠస్థాయికి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1.2లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.15లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 

Updated Date - 2020-09-18T09:53:37+05:30 IST