రాష్ట్రంలో 269 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-06-18T08:30:42+05:30 IST
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 269 పాజిటివ్‌లు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కేసు వెలుగచూసిన తర్వాత 24గంటల...

- 1096 శాంపిల్స్‌లో 25% పాజిటివ్..
- 24గంటల్లో రాష్ట్రంలో ఇవే అత్యధికం
- జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 214 మందికి
- ఒకరు మృతి.. 192కు మరణాలు
- రాష్ట్రంలో మొత్తంగా 5675కు కేసులు
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 269 పాజిటివ్‌లు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కేసు వెలుగచూసిన తర్వాత 24గంటల వ్యవధిలో ఈ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. బుధవారం 1096 శాంపిల్స్ పరీక్షిస్తే 13 జిల్లాల్లో 269 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 214 మంది ఉన్నారు. రాజధాని పరిధిలో 200కు పైగా కేసులు నమోదవ్వడం కూడా ఇదే తొలిసారి. రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగాం, ములుగులో ఐదుగురు చొప్పున, మెదక్, సంగారెడ్డిలో ముగ్గురుచొప్పున, వనపర్తి, మేడ్చల్, జిల్లాల్లో ఇద్దరు చొప్పున, వికారాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి జిల్లాల్లో ఒకరి చొప్పున వైరస్ బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదురోజుల్లోనే 1191 మందికి పాజిటివ్ వచ్చింది. ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడు రోజుల్లోనే 521 పాజిటివ్‌లు తేలాయి.
బుధవారం వైర్‌సతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరణాల సంఖ్య 192కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5675కు చేరింది. బుధవారం వైరస్ నుంచి మరో 151 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3071 మంది కరోనా నుంచి బయటపడగా, 2412 యాక్టివ్ కేసులున్నాయి. కాగా వైరస్ కారక మరణాల్లో దీర్ఘకాలిక జబ్బులున్నవారే చనిపోతున్నట్లు చెబుతున్నా 35 మంది మాత్రం ఎటువంటి ఇతర జబ్బులు లేకుండానే కరోనాతో చనిపోయారు. మిగిలిన మృతుల్లో 71 మంది రక్తపోటు, మధుమేహం, 22 మంది అధికరక్తపోటు, 21 మంది గుండె సంబంధిత జబ్బులు, 11 మంది డయాబెటిస్ మెలిటస్, ఏడుగురు ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్, ఏడుగురు న్యూరోలాజికల్ డిజార్డర్స్, ఐదుగురు కేన్సర్, మరో ఐదుగురు కిడ్నీ జబ్బులు, ముగ్గురు హెచ్‌ఐవీ, క్షయ, మరో ముగ్గురు హైపొథైరాయిడిజమ్, ఒకరు గ్యాస్ట్రిక్ అల్సర్ బాధితులు ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వచ్చిన కేసుల్లో 3671 మంది పురుషులు(65శాతం) మహిళలు 2004 (35 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. నమోదైన మొత్తం కేసుల్లో 21-40 మధ్య వయస్కుల వారే 2490 మంది ఉన్నారు. అంటే యాభై శాతం కేసులు ఈ వయసువారిలోనే నమోదవుతున్నాయి.
గూడూరు నారాయణ రెడ్డికి కరోనా
టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కరోనా వైరస్ సోకింది. బుధవారం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆయన అదే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా గూడూరు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఒళ్లు నొప్పులు, రుచి, వాసన తెలియక పోవడం వంటి ప్రాథమిక లక్షణాలు కనపడటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
ప్రాథమిక దశలోనే ఆస్పత్రిలో చేరినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరగా నయమవుతుందని తనకు వైద్యులు చెప్పినట్లు నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా.. సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని చెప్పేందుకు తన కేసే ఉదాహరణ అని గూడూరు తెలిపారు. తనకు ఇటీవలి కాలంలో ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని, కొవిడ్ -19 రోగితోగానీ, వారి దగ్గరి పరిచయాలతో కానీ ఎటువంటి కాంటాక్టులూ తనకు లేవన్నారు.
- కింగ్‌కోఠిలోని కొవిడ్ ఆస్పత్రి సూపరిటెండెంట్‌కు కరోనా సోకింది. దీంతో అక్కడి సిబ్బంది పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
- నిమ్స్‌లో ఇప్పటివరకు 26మంది వైద్యులు, 40మంది పారామెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. నిమ్స్‌లో 405 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.
- పెద్దపల్లి సుల్తానాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ములుగు ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్, వార్డ్‌బాయ్ కరోనా సోకింది.