వీధి వ్యాపారులకు 222 కోట్ల కేంద్ర రుణాలు

ABN , First Publish Date - 2020-12-27T08:38:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు రూ.222 కోట్ల రుణాలు అందజేసింది. ఆత్మ నిర్భర్‌ పథకం కింద తెలంగాణకు చెందిన

వీధి వ్యాపారులకు 222 కోట్ల కేంద్ర రుణాలు

 ఆత్మ నిర్భర్‌ నిధి స్కీంలో రాష్ట్రానికి మంజూరు

 రాష్ట్రంలో 2.22 లక్షల మందికి అందిన రుణం

 త్వరలో మరో 3 లక్షల మందికి 300 కోట్లు

 అందరికీ రుణాల కోసం పట్టణాల్లో స్పెషల్‌ డ్రైవ్‌


హైదరాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు రూ.222 కోట్ల రుణాలు అందజేసింది. ఆత్మ నిర్భర్‌ పథకం కింద తెలంగాణకు చెందిన 2.22 లక్షల మంది ఇప్పటికే ప్రయోజనం పొందారు. మరో 3 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు రూ.300 కోట్ల రుణాలు అందనున్నాయి. రుణాలు వీధి వ్యాపారులందరికీ దక్కేలా రాష్ట్ర మునిసిపల్‌ శాఖ త్వరలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనుంది.

కరోనా సంక్షోభ నివారణ కోసం ఆత్మ నిర్భర్‌ నిధి స్కీం కింద కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు రుణాలు, సహకారాన్ని ప్రకటించిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలందించి, వారి జీవన ప్రమాణాలు పునరుద్ధరిస్తామని ప్రకటించింది. 


రాష్ట్రంలో 5.90 లక్షల మంది వీధి వ్యాపారులు

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 5,90,607 మంది వీధి వ్యాపారులను అధికారులు గుర్తించారు. వీరిలో 4,34,866 మంది దరఖాస్తులను అధికారులు అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటికే 3,25,996 మందికి రుణాలు మంజూరు చేశారు.

ఇందులో 2,22,202 మంది బ్యాంకు ఖాతాలో డిజిటల్‌ మోడ్‌లో ఇప్పటికే రుణాలు చేరాయి. ప్రతి మునిసిపాలిటీలో బ్యాంకుల వారీగా రుణాల పంపిణీని లక్ష్యంగా నిర్ణయించి, వీధి వ్యాపారులతో జనవరి 4-21 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మునిసిపాలిటీలో కనీసం 3 క్యాంపులు నిర్వహించేందుకు నోడల్‌ అధికారులను నియమించాలని బ్యాంకర్లను ఆదేశించారు. 


ఆత్మ నిర్భర్‌తో వేగంగా..

వీధి వ్యాపారుల కోసం కేంద్రం ఐదేళ్ల క్రితమే చట్టం తెచ్చింది. పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులను గుర్తించడం, గుర్తింపు కార్డులు జారీ చేయడం, బ్యాంకు రుణాలివ్వడం, వెండింగ్‌ జోన్ల ఏర్పాటు, వెండింగ్‌ జోన్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని ఈ చట్టం ద్వారా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కానీ, గత నాలుగైదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదు.

కరోనా ప్రభావాని కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వీధి వ్యాపారుల సంఖ్య 80 వేలు కూడా దాటలేదు. ఆత్మ నిర్భర్‌ నిధి స్కీంలో వీధి వ్యాపారులందరికీ రుణాలిస్తారనడంతో వీధి వ్యాపారులను గుర్తించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 




చాలామంది అర్హులకు ఇవ్వలేదు 


రాష్ట్రంలో వీధి వ్యాపారుల గుర్తింపు అస్తవ్యస్థంగా ఉందని వీధి వ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంకటమోహన్‌ ఆరోపించారు. అనేక మంది అర్హులను ఇంకా గుర్తించలేదని, వారికి రుణాలివ్వలేదన్నారు.

అదే సమయంలో వీధి వ్యాపారుల సంఖ్యను భారీగా పెంచేలా అనర్హులైన వారిని గుర్తించారని, ఎస్‌హెచ్‌జీ మహిళలను కూడా వీధి వ్యాపారులుగా గుర్తించి రుణాలిచ్చారని ఆరోపించారు. అర్హులైన వారందరికీ రుణాలివ్వాలని డిమాండ్‌ చేశారు. వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, వీధి వ్యాపారులపై ట్రాఫిక్‌ పోలీసులు, అధికారుల వేధింపులను నిరోధించాలని ప్రభుత్వాన్ని వెంకటమోహన్‌ కోరారు. 

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటమోహన్‌ 

Updated Date - 2020-12-27T08:38:13+05:30 IST