రైతుబంధులో 150 కోట్ల ఆదా!

ABN , First Publish Date - 2020-12-28T08:26:06+05:30 IST

పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు నిధుల్లో ఈసారి రూ.150కోట్లు ఆదా కానున్నాయి

రైతుబంధులో 150 కోట్ల ఆదా!

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు నిధుల్లో ఈసారి రూ.150కోట్లు ఆదా కానున్నాయి. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇరిగేషన్‌ శాఖకు అప్పగించినా.. రికార్డుల్లో ఇంకా రైతుల పేరిటే ఉన్న భూములను ఆ శాఖకు బదలాయించడం వల్లే ఈ నిధులు మిగలనున్నాయి. ఇరిగేషన్‌ శాఖ పరిధిలో 12.8 లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఇందులో సుమారు 3 లక్షల ఎకరాల భూములు రైతుల పేరిటే ఉన్నాయి. దీంతో రైతుబంధు నిధులు ఆ రైతుల ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఆ భూములన్నింటినీ రైతుల పేరు నుంచి తొలగించి ఇరిగేషన్‌ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. రెవెన్యూ శాఖ పరిధిలోని ధరణిలో కూడా ఈ వివరాలను పొందుపరిచారు. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని భూమల వివరాలు సేకరించి, వాటిని ఆయా శాఖల పేరిట మ్యుటేషన్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్‌ శాఖకు ఉన్న భూముల వివరాలను సేకరించారు.


సాధారణంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం భారీగా భూములను సేకరిస్తూ ఉంటారు. ఇలా 1960లో శ్రీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌ వంటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములను కూడా మొన్నటి వరకు ఇరిగేషన్‌ శాఖ పరిధిలోకి తీసుకురాలేదు. సదరు భూములకు సంబంధించిన రికార్డుల్లో రైతుల పేర్లే కొనసాగుతూ వచ్చాయి. ఇందులో ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములతోపాటు, అప్పటికే చెరువులు, కుంటల పరిధిలోని భూములు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఇరిగేషన్‌ శాఖ పేరిట మ్యుటేషన్‌ చేశారు. వానాకాలం సీజన్‌ ముందు నుంచి మొదలైన ఈ ప్రక్రియ ప్రస్తుతం పూర్తయింది. దీంతో సుమారు 3 లక్షల ఎకరాలకు సంబంఽధించి రైతుబంధు నిధులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫలితంగా సుమారు రూ.150 కోట్ల నిధులు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-12-28T08:26:06+05:30 IST