ఒక్క రోజే 15 కేసులు
ABN , First Publish Date - 2020-04-01T08:10:15+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అవన్నీ కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదుతో సంబంధం ఉన్నవే

అన్నీ మర్కజ్ మసీదుతో లింకున్నవే.. రాష్ట్రంలో 91కి చేరిన కరోనా కేసులు
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అవన్నీ కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదుతో సంబంధం ఉన్నవే అని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. ఈ కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 91కి చేరింది. అందులో ఆరుగురు చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. మంగళవారం 13 మందిని డిశ్చార్జి చేశారు. మార్చి 2న నమోదైన తొలి పాజిటివ్ కేసును ఇప్పటికే డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 77 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ నుంచి వచ్చిన వారంతా గాంధీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని కోరారు.
కరోనా వైరస్ లక్షణాలున్న వారి బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మార్చి 27న అత్యధికంగా 14 కేసులు నమోదయ్యాయి. తాజాగా దాన్ని మించి 15 కేసులు బయటపడ్డాయి. మార్చి 14 నుంచి మంగళవారం వరకు ప్రతి రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేవలం 18 రోజుల్లో 96 కేసులు నమోదయ్యాయి. ‘‘కిడ్నీ, తలసేమియా, సికెల్‌సెల్ జబ్బులున్న వారికి రక్తమార్పిడి అవసరమవుతుంది. కాబట్టి వారికి ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. వారిని అడ్డుకోవద్దు’ అని పోలీసులకు మంత్రి కోరారు. గర్భిణులకు ఇబ్బందులు తలెత్తకుండా మాతా శిశు సంరక్షణ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని మంత్రి కోరారు.
1500 మందికి పరీక్షలు!
మర్కజ్ వెళ్లి వచ్చిన వారందర్నీ రెండు రకాలుగా విభజించి, క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయించారు. మంగళవారం దీనిపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. మొదట కేటగిరిలో- వైరస్ లక్షణాలు లేనివారు, 14 రోజులు క్వారంటైన్ పూర్తయిన వారిని కూడా ఇంకా హోమ్ క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయించారు. రెండో కేటగిరిలో- 14 రోజుల క్వారంటైన్ గడువు పూర్తికాని వారిని అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తంగా మర్కజ్‌తో సంబంధమున్న వారిలో 1500 మందికి పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు నిండిపోతే కింగ్ కోఠీ, ఆపై చెస్ట్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అలాగే సనత్‌నగర్, నాచారం ఈఎ్‌సఐలలో 300 పడకల చొప్పున అందుబాటులోకి రానున్నాయి. కొన్ని జిల్లాల్లో మర్కజ్‌తో లింకు ఉన్న అనుమానితులను ప్రైవేటు వైద్య కళాశాలల ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. మంగళవారం వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు.