ఒక్క రోజులో 14

ABN , First Publish Date - 2020-03-28T08:54:36+05:30 IST

రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 59కి పెరిగింది. అయితే శుక్రవారం

ఒక్క రోజులో 14

కరోనా కేసుల వివరాలపై ఆరోగ్య శాఖ గప్‌చుప్‌

రాష్ట్రంలో 59కి పెరిగిన  బాధితుల సంఖ్య

గడిచిన 10 రోజుల్లోనే 54 కేసులు నమోదు

కేసుల సంఖ్యలో నాలుగో స్థానంలో తెలంగాణ


హైదరాబాద్‌/ఖైరతాబాద్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 59కి పెరిగింది. అయితే శుక్రవారం నమోదైన 14 కేసుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో ఈ రోజు 10 కేసులని వెల్లడించారు. ఆ తర్వాత మరో 4 పెరిగాయి. ఇంతకు ముందు కేసీఆర్‌ మీడియా సమావేశాల్లో కేసుల వివరాలు చెప్పినప్పటికీ, వైద్య ఆరోగ్యశాఖ మీడియా బులెటెన్‌ విడుదల చేసేది. కానీ శుక్రవారం అలా చేయకపోవడం గమనార్హం. కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న  వైద్యుడికి, వైద్యురాలైన ఆయన భార్యకు వైరస్‌ సోకింది. వారి పిల్లలిద్దరి నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అమెరికా నుంచి వచ్చిన 70 సంవత్సరాల వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మిగిలిన కేసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో గడిచిన పది రోజుల్లో 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు ఈ నెల 2న నమోదైంది. ఆ తరువాత 12 రోజుల పాటు ఎటువంటి కేసు నమోదు కాలేదు. 14న ఇటలీ నుంచి వచ్చిన ఓ వైద్య విద్యార్థినికి కరోనా సోకింది. అప్పటి నుంచి ప్రతి రోజు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 18న కరీంనగర్‌కు వచ్చిన  ఇండోనేషియా బృందంలోని 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఏకంగా 14 కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కంగుతిన్నాయి. కాగా, కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ నమోదైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. కేరళ 176 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, 156 కేసులతో మహరాష్ట్ర రెండో స్థానంలో ఉంది. 64 కేసులతో కర్నాటక మూడో స్థానంలో, 59 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. 


కరోనాతో వృద్ధుడి మృతి..?

జ్వరంతో బాధపడుతూ ఖైరతాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు(74) చనిపోయాడు. అతడు ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కొద్ది గంటల్లోనే మరణించాడు. వృద్ధుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని అస్పత్రి వర్గాలు సైఫాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడితో పాటు మరొకరు కూడా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-03-28T08:54:36+05:30 IST