తెలంగాణలో..లక్ష జనాభాకు 130 మంది పోలీసులు

ABN , First Publish Date - 2020-12-30T08:15:17+05:30 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరే శాఖకు ఇవ్వనంతగా పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అలవెన్సులను పెంచడం..

తెలంగాణలో..లక్ష జనాభాకు 130 మంది పోలీసులు

పోలీసు శాఖలో 29 వేల ఖాళీలు.. ఐపీఎ్‌సలకూ తీవ్రంగా కొరత 

వీఐపీలకు పెరిగిన పోలీసు సేవలు

సీసీ కెమెరాల వినియోగంలో రాష్ట్రం టాప్‌

కానిస్టేబుళ్ల భర్తీలో రెండో స్థానం

గణాంకాలను వెల్లడించిన బీపీఆర్‌డీ


న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరే శాఖకు ఇవ్వనంతగా పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అలవెన్సులను పెంచడం.. కొత్త వాహనాలు.. ఠాణాలకు పక్కా భవనాలు.. ఇలా వనరులను ఎంతగా పెంచినా.. రాష్ట్రంలో పోలీసుల కొరత తీవ్రంగా ఉందని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(బీపీఆర్‌డీ) స్పష్టం చేసింది. రాష్ట్రంలో సివిల్‌, జిల్లా సాయుధ, ప్రత్యేక సాయుధ బలగాలు, భారత రిజర్వు బెటాలియన్లకు కలిపి మంజూరైన పోస్టులు 78,369 కాగా.. ప్రస్తుతం 48,877 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది. అందులో మహిళా పోలీసుల వాటా 2,500గా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 29,492 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. పోలీసులు.. ప్రజల నిష్పత్తి విషయానికి వస్తే.. రాష్ట్ర జనాభా ప్రకారం ప్రతి లక్ష మందికి 209.85 మంది పోలీసులు ఉండాలి. అయితే.. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం లక్ష మంది జనాభాకు 130.88 మంది పోలీసులు ఉన్నట్లు తెలిపింది. 476.54 మందికి ఒక పోలీసుకు గాను.. 764.04 మందికి ఒక పోలీసు ఉన్నారు. 2020 జనవరి 1 వరకు ఉన్న సమాచారం మేరకు ‘’పోలీసు సంస్థల వివరాల’ పేరిట బీపీఆర్‌డీ రూపొందించిన నివేదికను మంగళవారం కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.


ఆ నివేదిక ప్రకారం.. 2019లో 14,933 కానిస్టేబుళ్ల భర్తీతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. కాగా, రాష్ట్రంలో డీజీపీ, ప్రత్యేక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఉండాల్సింది.. ఐదుగురు ఉన్నారు. ఆరుగురు అదనపు డీజీపీలు ఉండాల్సింది 18 మంది ఉన్నారు. 16 మంది ఐజీలు ఉండాల్సింది.. 20 మంది ఉన్నారు. అయినా.. రాష్ట్రంలో ఐపీఎ్‌సల కొరత ఉందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రానికి 139 మంది ఐపీఎ్‌సలను మంజూరు చేయగా.. ప్రస్తుతం 105 మంది పనిచేస్తున్నారని పేర్కొంది. వారిలో 8 మంది కేంద్ర డిప్యుటేషన్‌లో ఉన్నారని వివరించింది. పోలీస్‌ కమిషనరేట్లు అత్యఽధికంగా ఉన్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో 9 పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. సీసీ కెమెరాల విషయంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది, రాష్ట్ర పోలీసుల పరిధిలో 2,82,558 సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే, 53 స్పీడ్‌ లేజర్‌ గన్‌లు, 498 బ్రీత్‌అనలైజర్లు ఉన్నాయి.


వీఐపీ సేవలో పోలీసులు

తెలంగాణలో వీఐపీల సంఖ్య పెరగడంతో.. వారి సేవలో ఉండే పోలీసుల సంఖ్య కూడా పెరిగిందని బీపీఆర్‌డీ వెల్లడించింది. 2018లో 487 మంది వీఐపీలు ఉండగా.. 2019లో ఆ సంఖ్య 799కి పెరిగింది. వారి భద్రతకు 2018లో 2,268 పోలీసులు పనిచేయగా.. 2019కి వీఐపీల భద్రతలో ఉండే పోలీసుల సంఖ్య 3,512కి పెరిగింది.


తగ్గిన బడ్జెట్‌ 

తెలంగాణలో పోలీసు శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గినట్లు బీపీఆర్‌డీ నివేదిక వెల్లడించింది. 2018-19 సవరించిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,152 కోట్లు కేటాయించగా.. 2019-20లో రూ. 4,785.06 కోట్లు కేటాయించిందని వివరించింది. 2018-19లో కేటాయించిన మొత్తానికి మించి కొంత మొత్తం ఖర్చు చేసినా.. 2019-20లో మాత్రంలో కేటాయించిన బడ్జెట్‌ మొత్తాన్ని ఖర్చు చేయలేదని పేర్కొంది.


నివేదికలోని ఇతర వివరాలు

రాష్ట్రంలోని పీఎస్‌ల సంఖ్య 838

అద్దె భవనాల్లో కొనసాగుతున్న పీఎస్‌ల సంఖ్య 68

అద్దె భవనాల్లో ఉన్న ఎస్పీ కార్యాలయాల సంఖ్య 5

Updated Date - 2020-12-30T08:15:17+05:30 IST