రోజుకు 1000 పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-24T09:12:41+05:30 IST

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన మొబైల్‌ వైరాలజీ రిసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌తో కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం మరింత పెరగనుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

రోజుకు 1000 పరీక్షలు

ఈఎస్ఐలో దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌

కరోనాపై సమష్టిగా పోరాడుదాం

15 రోజుల్లో బీఎ్‌సఎల్‌-3 ల్యాబ్‌.. అద్భుతం

డీఆర్‌డీవో కృషి భేష్‌: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

ప్రజలూ సహకరించాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభం 

పరీక్షలతోపాటు వ్యాక్సిన్‌పై పరిశోధనలకు ఊతం

ఐకామ్‌, ఐక్లీన్‌ సంస్థల సహకారంతో రూపకల్పన

తెలంగాణలో త్రిముఖ వ్యూహం: కేటీఆర్‌


న్యూఢిల్లీ/హైదరాబాద్‌సిటీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన మొబైల్‌ వైరాలజీ రిసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌తో కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం మరింత పెరగనుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ ల్యాబ్‌ ద్వారా ఒక్క రోజులో 1000కి పైగా పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు అందరం సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆవరణలో ఏర్పాటు చేసిన మొబైల్‌ వైరాలజీ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సంతో్‌షకుమార్‌ గంగ్వార్‌, కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ బయోసెఫ్టీ లెవల్‌-3 ల్యాబ్‌ను తయారు చేయడానికి 6 నెలల సమయం పడుతుందని, కానీ 15 రోజుల్లోనే ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం అద్భుతమని పేర్కొంటూ డీఆర్‌డీవోకు అభినందనలు తెలిపారు.

కరోనాతో దేశంలో విషమ పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి సమయంలో మొబైల్‌ ల్యాబ్‌ల అవసరం చాలా ఉందన్నారు. కరోనా కట్టడికి ప్రధాని మోదీ సకాలంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రక్షణ శాఖ తరఫున సాయుధ బలగాలు సైతం అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నాయని వివరించారు. ‘‘ప్రజల సహకారంతోనే కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు నో కరోనా అంటూ స్వీయ కట్టడి చేసుకుంటుంటే... పట్టణ ప్రజలు మాత్రం ఆవో కరోనా అంటున్నారు.


ఇది మంచి పద్ధతి కాదు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 304 కరోనా పరీక్ష కేంద్రాలు, 755 ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేశామని చెప్పారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి 1.86 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 24వేలు ఐసీయూ పడకలని పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్‌, డీఆర్‌డీవో వంటి సంస్థలు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నాయని వివరించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రపంచంలోనే భారత్‌ శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని, దీనికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. 


త్రిముఖ వ్యూహం

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అవలంబిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కట్టడి ప్రాంతాలను గుర్తించి, ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పైమ్రరీ, సెకండరీ కాంటాక్టులను సైతం హోంక్వారంటైన్‌ చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడికి ప్రత్యేకంగా ఎనిమిది ఆస్పత్రులు సిద్ధం చేశామని, గచ్చిబౌలిలో 1500 పడకలతో అత్యాధునిక ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే కరోనాను తరిమికొట్టవచ్చని, అదే సమయంలో ప్రజలందరూ లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. 


ఇవీ ప్రత్యేకతలు

కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సిన్‌, మందుల తయారీపై విస్తృత పరిశోధనలు చేసేందుకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ల్యాబ్‌ను తీర్చిదిద్దినట్లు శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, మధుసూదన్‌రావు వివరించారు.  


జూ నమూనాలను పరీక్షించడానికి రెండు కంటైనర్లలో నలుగురు శాస్త్రవేత్తలు ఉంటారు. నమునాలు సేకరించిన ఐదు గంటల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.


జూ తొలుత రోజుకు 200 నుంచి 500 నమునాలను పరీక్షిస్తారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 500 నుంచి 1000కి పెంచనున్నారు. 


జూ ల్యాబ్‌ లోపలికి వెళ్లేందుకు ఇంటర్‌ లాక్‌ డోర్‌ విధానాన్ని ఏర్పాటు చేశారు. నమునాలను పాస్‌బాక్స్‌లో ఉంచితే అది కంటైనర్‌లోకి వెళ్తుంది. ప్రతిసారీ లోనికి వెళ్లాల్సిన అవసరం లేదు.


జూ ఈ కంటైనర్‌ ల్యాబ్‌ను ఎక్కడికైనా తరలించే అవకాశం ఉంది. లారీల్లో మారుమూల గ్రామాలకు సైతం తీసుకెళ్లి పరీక్షలు చేయొచ్చు. 


కంటైనర్లు అందించిన ‘మెఘా’ గ్రూపు సంస్థ ఐకామ్‌

మొబైల్‌ కంటైనర్‌ వైరాలజీ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ కోసం మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాక్చర్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ సంస్థ అయిన ఐకామ్‌ 30 అడుగుల పొడువైన రెండు భారీ కంటైనర్లను అందజేసింది. పలు ప్రాంతాల్లో తిరుగుతూ నమునాలు సేకరించేందుకు, వాటిని పరీక్షించేందుకు వీలుగా వీటిని రూపొందించింది. ఆర్మీ అవసరాల కోసం పలు పరికరాలను రూపొందించిన ఈ సంస్థ.. బ్రహ్మోస్‌, ఆకాశ్‌, ప్రళయ్‌ వంటి క్షిపణులకు సంబంధించిన కంటైనర్లను తయారు చేస్తోంది.  

Updated Date - 2020-04-24T09:12:41+05:30 IST