ధరణితో 10 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2020-11-07T06:51:04+05:30 IST

ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు రూ.10.77

ధరణితో 10 కోట్ల ఆదాయం

పోర్టల్‌ ద్వారా ఇప్పటికి 4525 రిజిస్ట్రేషన్లు

త్వరలో నాలా, మార్ట్‌గేజ్‌ డీడ్‌లు: సీఎస్‌

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు రూ.10.77 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 2 నుంచి ధరణి ద్వారా ఇప్పటివరకు 4525 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఏరోజు స్లాట్‌లు ఆ రోజే పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడం,పోర్టల్‌ వేగం పుంజుకోవడంతో 6వ తేదీ ఒక్కరోజే 1472 రిజిస్ట్రేషన్లు జరిగాయి.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ శుక్రవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, సీఎంవో కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌, ధరణి ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావుతో కలిసి ధరణి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు.

ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయాల్లో సేల్‌డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, సక్సెషన్‌ డీడ్‌, పార్టిషన్‌ డీడ్‌లు జరుగుతున్నాయని, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే నాలా డీడ్‌, మార్ట్‌గేజ్‌ డీడ్‌ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని సీఎస్‌ తెలిపారు. 


Updated Date - 2020-11-07T06:51:04+05:30 IST