గంగూలీలా.. ధోనీ, విరాట్ నాకు మద్దతు ఇవ్వలేదు: యువరాజ్

ABN , First Publish Date - 2020-04-01T20:53:47+05:30 IST

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించాడు. టీం ఇండియా మాజీ

గంగూలీలా.. ధోనీ, విరాట్ నాకు మద్దతు ఇవ్వలేదు: యువరాజ్

ముంబై: టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించాడు. టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనకు ఎంతో మద్దతు ఇచ్చాడని.. అటువంటి మద్దతు తనకి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి లభించలేదని యువీ అన్నాడు. గంగూలీ సారథ్యంలో ఆడిన తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని యువీ స్పష్టం చేశాడు. 


2011 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపేందుకు యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో అన్ని విభాగాల్లో రాణించిన అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా అవార్డు అందుకున్నాడు. అంతేకాక.. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ-20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టులో యువీ స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. 2019 జూన్‌లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 


అయితే తాజాగా యువీ స్పోర్ట్‌స్టార్ అనే మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘‘నేను గంగూలీ కెప్టెన్సీలో ఆడాను మరియు ఆయన నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. ఆ తర్వాత కెప్టెన్సీ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. అప్పుడు నాకు గంగూలీ మరియు ధోనీ మధ్య చాలా తేడా కనిపించింది. గంగూలీ కెప్టెన్సీలో ఆడినప్పుడు నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అతను నాకు అంత మద్దతు ఇచ్చేవాడు. కానీ, ధోనీ మరియు విరాట్ కోహ్లీ నుంచి నాకు అటువంటి మద్దతు లభించలేదు’’ అని యువీ తెలిపాడు. 


ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన క్రికెటర్లలో యువీ కూడా ఉన్నాడు. అంతేకాక.. తన అభిమానులు ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అతను కోరాడు. 

Updated Date - 2020-04-01T20:53:47+05:30 IST