రహానేపై యువరాజ్, సెహ్వాగ్ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2020-12-28T02:35:55+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే అజేయ సెంచరీ చేయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

రహానేపై యువరాజ్, సెహ్వాగ్ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే అజేయ సెంచరీ చేయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియాపై 82 పరుగుల ఆధిక్యం లభించింది. కోహ్లీ గైర్హాజరీలో జట్టును నడిపిస్తున్న అజింక్య రహానే అజేయ సెంచరీతో అదరగొట్టాడు. 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు బౌలర్లను సక్రమంగా వినియోగించుకుని ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేశాడు. 


సారథ్య బాధ్యతలతో ఒత్తిడి పెరిగినప్పటికీ సెంచరీతో రాణించి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచుతున్న రహానేపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ కెప్టెన్ సెంచరీ చేయడం అతడి దృఢత్వానికి, ప్రశాంతతకు గుర్తు అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ఫీల్డింగ్ సెట్టింగ్స్ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడని పేర్కొన్నాడు. లోయర్ డౌన్‌లో బ్యాటింగుకు వచ్చినప్పటికీ రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నాడని, అరంగేట్ర మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ శుభారంభం చేశాడని కొనియాడాడు.  కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడిన రహానేను వీరేంద్ర సెహ్వాగ్ అభినందించాడు. ‘బ్రిలియంట్ హండ్రెడ్’ అని ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-12-28T02:35:55+05:30 IST