అమ్మాయిల సవాల్
ABN , First Publish Date - 2020-11-04T06:26:22+05:30 IST
పురుషులతోపాటు మహిళలు కూడా ధనాధన్ లీగ్ ఐపీఎల్‌లో సందడి చేయనున్నారు. ‘మహిళల టీ20 చాలెంజ్’ మూడో అంచె బుధవారం ఆరంభం కానుంది...
తొలి మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ ఢీ
షార్జా: పురుషులతోపాటు మహిళలు కూడా ధనాధన్ లీగ్ ఐపీఎల్‌లో సందడి చేయనున్నారు. ‘మహిళల టీ20 చాలెంజ్’ మూడో అంచె బుధవారం ఆరంభం కానుంది. భారత క్రీడాకారిణులతోపాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, థాయ్‌లాండ్ ప్లేయర్లు కూడా లీగ్‌లో పాల్గొంటున్నారు. నాలుగు మ్యాచ్‌ల ఈ టోర్నీలో మూడు జట్లు.. డబుల్ డిఫెండింగ్ చాంప్ సూపర్ నోవాస్, వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్ ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. టాప్‌లో నిలిచిన జట్లు వచ్చే సోమవారం (9న) జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండుసార్లు విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్.. ముచ్చటగా మూడో టైటిల్‌పై గురి పెట్టింది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ టీమ్ వెలాసిటీతో సూపర్ నోవాస్ తలపడనుంది. గత ఏడాది మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధ శతకాలు బాదిన హర్మన్.. వెలాసిటీతో ఫైనల్లో 37 బంతుల్లో 51 పరుగులతో జట్టును విజేతగా నిలిపింది.
అయితే, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కౌర్.. ఈ లీగ్‌తో మళ్లీ టచ్‌లోకి రావాలనుకుంటోంది. గతేడాది ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన జమీమా రోడ్రిగ్స్‌పై అందరి దృష్టీ నిలిచే అవకాశం ఉంది. గత సీజన్‌లో జమీమా 123 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిథాలీ సారథ్యంలోని వెలాసిటీ జట్టులో టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. టీ20 వరల్డ్‌కప్‌లో షఫాలీ సిక్సర్లతో అదరగొట్టింది. కాగా, కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ప్లేయర్లు ఏమాత్రం ఫిట్‌గా ఉంటారో చూడాలి. డాషింగ్ బ్యాట్స్‌వుమన్ స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్.. వెటరన్ జులన్ గోస్వామి, వెస్టిండీస్ స్టార్ దియేంద్ర డాటిన్, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్‌తో బలంగా కనిపిస్తోంది. కాగా అన్ని మ్యాచ్‌లూ షార్జాలోనే జరగనున్నాయి.
