సోషల్ మీడియాకు పాక్ మాజీ కెప్టెన్ గుడ్‌ బై.. కారణం తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2020-05-30T02:55:46+05:30 IST

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాను వదిలేస్తున్నట్టు

సోషల్ మీడియాకు పాక్ మాజీ కెప్టెన్ గుడ్‌ బై.. కారణం తెలిస్తే షాక్!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాను వదిలేస్తున్నట్టు చెబుతూ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో అతడు మాట్లాడుతూ.. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైందని, హ్యాకర్లు తన ఖాతాలో అశ్లీల వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టారని పేర్కొన్నాడు. అంతేకాక పలు అసభ్యకరమైన సందేశాలను షేర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవి తనను, తన కుటుంబాన్ని వేదనకు గురిచేశాయన్నాడు. హ్యాకర్లు ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదన్నాడు. ‘‘నేను ఈ ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా విచారించాల్సి వచ్చింది. ఎవరో నా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి అశ్లీల వీడియోను లైక్ చేశారు’’ అని పేర్కొన్నాడు.  


వకార్ ట్విట్టర్ ఖాతాలో అశ్లీల వీడియోలకు లైక్ కొట్టి ఉండడంతో అతడి అభిమానులు విమర్శలు గుప్పించారు. దీంతో స్పందించిన వకార్ ఈ వీడియోను పోస్టు చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాపై తనకున్న అభిప్రాయాన్ని మార్చేసిందన్నాడు. ‘‘ఇది నాకు, నా కుటుంబానికి సిగ్గుచేటైన, విచారకరమైన, బాధాకరమైన విషయం. సోషల్ మీడియా అంటే ప్రియమైన వారితో సంభాషించేందుకు ఒక వేదిక అని భావించాను. అయితే, దురదృష్టవశాత్తు నా ఖాతాను హ్యాక్ చేయడం ఇది మొదటిసారి కాదు. అంతేకాదు, ఆ వ్యక్తి (హ్యాకర్) ఇకపైనా ఆగడని అనిపిస్తోంది. అందుకే ఈ రోజు నుంచి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను’’ అని వకార్ పేర్కొన్నాడు.


అంతేకాదు, 48 ఏళ్ల వకార్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మరోమారు తాను సోషల్ మీడియాను ఉపయోగించనని తేల్చి చెప్పాడు.  

Updated Date - 2020-05-30T02:55:46+05:30 IST