ముగిసిన క్వారంటైన్.. ఇంటికి చేరిన విశ్వనాథన్ ఆనంద్

ABN , First Publish Date - 2020-06-07T02:56:18+05:30 IST

మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన గత శనివారం భారత్‌కు చేరుకున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్

ముగిసిన క్వారంటైన్.. ఇంటికి చేరిన విశ్వనాథన్ ఆనంద్

చెన్నై: మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయి గత శనివారం భారత్‌కు చేరుకున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బెంగళూరులో వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ తర్వాత ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ‘‘అవును నేను ఇంటికి చేరుకున్నాను. కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా కుమారుడిని చూడడం సంతోషంగా ఉంది’’ అని ఆనంద్ పేర్కొన్నాడు.


గత నెల 30న స్వదేశానికి చేరుకున్న ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఏడు రోజుల సంస్థాగత క్వారంటైన్ పూర్తిచేసుకున్నాడు. తాను ఇంటికి చేరుకున్నట్టు చెస్ మాంత్రికుడు ట్వీట్ చేశాడు. బెంగళూరులో తాను క్వారంటైన్‌లో ఉన్న హోటల్‌కు ఈ సందర్భంగా ఆనంద్ కృతజ్ఞతలు తెలిపాడు. 112 రోజుల తర్వాత ఆనంద్ ఇంటికి రావడం ఆనందంగా ఉందని అతడి భార్య అరుణ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుమారుడు అఖిల్ చాలా సంతోషంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T02:56:18+05:30 IST