టీమిండియా బ్యాటింగ్‌ను ఓటీపీతో పోల్చిన సెహ్వాగ్

ABN , First Publish Date - 2020-12-19T23:22:26+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయంపై టీమిండియా మాజీ ఓపెనర్

టీమిండియా బ్యాటింగ్‌ను ఓటీపీతో పోల్చిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయంపై టీమిండియా మాజీ ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. భారత బ్యాటింగ్‌ను ఓటీపీతో పోల్చాడు. ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. వరుసగా.. 4,9,2,0,4,0,8,4,0,4,1 పరుగులు చేశారు. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను ఓటీపీతో పోల్చిన సెహ్వాగ్.. దీనిని ఎవరూ గుర్తుపెట్టుకోవాలని అనుకోరని అన్నాడు. ఓటమిని మర్చిపోవడానికి ఓటీపీ ఇదేనంటూ ఆటగాళ్లు చేసిన వ్యక్తిగత స్కోర్లను (49204084041)ను పేర్కొన్నాడు.


తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 53 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్ ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించినట్టే కనిపించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసింగ్ ద్వయం జోస్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్ దెబ్బకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ కకావికలైంది. 36 వికెట్లకే కుప్పకూలింది.  దీంతో మొత్తంగా 89 పరుగుల ఆధిక్యం లభించగా, 90 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. 


దీనికి తోడు పాట్ కమిన్స్ బౌలింగులో పేసర్ మహమ్మద్ షమీ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగడం భారత్‌ను మరింత దెబ్బతీసింది. కాగా, 1974లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 42 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు అదే అత్యల్పం కాగా, ఇప్పుడా రికార్డును కోహ్లీ సేన తిరగరాసింది. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్‌లు డకౌట్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే జట్టులో వ్యక్తిగత అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 

Read more